వెల వెలబోతున్న గన్నవరం ఐటిపార్క్
Published on: Sat Mar 3, 2012 2:19PM
విజ
యవాడ: విజయవాడ సమీపంలోని గన్నవరం ఐటిపార్క్ వ్యాపార లావాదేవీలు లేక వెల వెలబోతోంది. ఈ పార్కును ప్రారంభించి నాలుగేళ్ళు గడుస్తున్నా ఇప్పటిదాకా నాలుగు కంపెనీలు మాత్రమే తమ కార్యాలయాలు ప్రారంభించాయి. వేలాదిమందికి ఉపాధి కల్పించాల్సిన ఈ పార్కులో ప్రస్తుతం 200 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా 30 ఎకరాల విశాలమైన స్థలంలో 2006 మే 27న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఐటి పార్కుకు శంఖుస్థాపన చేశారు. దీనివల్ల ప్రత్యక్షంగా 10వేల మందికి, పరోక్షంగా 30వేల మందికి ఉపాధి కలుగుతుందని అప్పట్లో ఆయన ప్రకటించారు. ఇటీవల ఐటి పార్కును సందర్శించిన రాష్ట్ర ఐటిశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఈ ఐటి పార్కుకు ఎంతో భవిష్యత్తు ఉందని, హైదరాబాద్ కు ధీటుగా ఇది తయారవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సుమారు 80 కోట్లతో నిర్మించిన మొదటి దశ టవర్ లో ప్రస్తుతం నాలుగు కంపెనీలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిజానికి ఇక్కడ 20 సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ఖాళీగా ఉంటున్న మిగిలిన భాగాల మెయింటినెన్స్ కూడా నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. మొదటిదశ టవర్ ఖాళీగా ఉండడంతో మిగిలిన టవర్ ల నిర్మాణం నిలిచిపోయింది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నా, కొత్తగా సంస్థలు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఐటి పరిశ్రమ తిరోగమనంలో ఉండటం, పరిశ్రమలన్నీ హైదరాబాద్ కే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ దుస్థితి దాపురించింది.


