షేర్ హోల్డర్ లను నట్టేట ముంచిన ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్
Published on: Tue Feb 14, 2012 10:11AM
కో ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ పై విచారణ జరుపుతున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు
వి
జయవాడ: విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రారంభించిన ల్యాంకో గ్రూప్ వేలాది మంది షేర్ హోల్డర్ లను నట్టేట ముంచింది. ఈ గ్రూప్ లోని ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని షేర్ల రూపంలో సేకరించింది. దేశంలో ఇన్ ఫ్రాటెక్ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని షేర్ హోల్డర్ లను నమ్మబలికింది. లాభాలు వస్తాయనే ఆశతో అనేక మంది ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. అయితే కంపెనీ యాజమాన్యం అత్యాశ, అనైతిక కార్యకలాపాల వల్ల షేర్ హోల్డర్ లు అపారంగా నష్టపోయిన వైనం ఇది.
వివరాల్లోకి వెళితే... లగడపాటి అమరప్పనాయుడు అండ్ కంపెనీ (ల్యాంకో ) ను 25 సంవత్సరాల క్రితం రాజగోపాల్ ప్రారంభించారు.మొదట ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్ గా, తర్వాత తెలుగుగంగ పనుల సబ్ కాంట్రాక్టర్ గా వ్యాపార జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్ తర్వాత సిమెంట్, కాస్టింగ్స్ ఐ.టి., ఇన్ ఫ్రా, కొండపల్లి పవర్ యూనిట్లను నెలకొల్పారు. అప్పట్లో వీటిలో ఒక్క కొండపల్లి పవర్ మాత్రమే లాభాలను ఆర్జించగా మిగిలిన యూనిట్లన్ని నష్టాలపాలయ్యాయి. ఈ నేపధ్యంలో రాజగోపాల్ అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉపేంద్రకు అల్లుడయ్యాడు. ఉపేంద్ర ద్వారా చంద్రబాబుకు సన్నిహితుడై ల్యాంకో కొండపల్లికి అనేక రాయితీలు పొందాడు. విద్యుత్ కేంద్రం పని చేసినా పని చేయకపోయినా కొంత స్థిర వ్యయాన్ని దానికి రాష్ట్ర పభుత్వం చెల్లించాలన్న రాయితీ ముఖ్యమైంది. ఈ రాయితీ ద్వారా రాజగోపాల్ సుమారు 700 కోట రూపాయల మేరకు లబ్ధిపొందారు.
రాజగోపాల్ 2004 లో కాంగ్రెస్ పార్టీ ఎం.పి.గా ఎన్నికయ్యేనాటికి అతని పారిశ్రామిక సంస్థల టర్నోవర్ సుమారు 1000 కోట్లు. అది ప్రస్తుతం 16వేల కోట్లకు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం రాజగోపాల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ తన పలుకుబడిని పూర్తిగా తన సంస్థల అభివృద్ధికి కేటాయించడమే. ఈ ఎనిమిదేళ్ళలో ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని 16రెట్లు విస్తరించుకున్నాడు గాని విజయవాడ అభివృద్ధికి చేసింది శూన్యం.
వ్యాపారాభివృద్ధిలో భాగంగా ఆయన తనకు అత్యంత సన్నిహితుడైన యార్లగడ్డ హరీష్ చంద్రప్రసాద్ వంటి వారికి కూడాహ్యాండ్ ఇచ్చారనే అపవాదుమూటగట్టుకున్నారు. రాజగోపాల్ పార్లమెంట్ సభ్యుడైన తర్వాత కంపెనీ పగ్గాలను తన సోదరుడు మధుసూదన్ కు అప్పగించారు. అన్నకన్నా రెండాకులు ఎక్కువ చదివిన మధుసూధన్ గ్రూప్ ను విస్తరించాలనే తాపత్రయంతో అనేక తప్పులు చేశారు. వెనకాముందు ఆలోచించకుండా భారత ప్రజల నుంచి సేకరించిన ధనంతో ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు కొనుగోలు చేశారు. అక్కడ కూడా ఎత్తులు జిత్తులు వేయాలని చూసి చేతులు కాల్చుకున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని బొగ్గుగనులను గ్రిఫిన్ కోల్ అనే ప్రైవేట్ సంస్థనుంచి ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ 2011 జూన్ లో కొనుగోలు చేసింది. అయితే అప్పటికి రెండు సంవత్సరాల ముందే గ్రిఫిన్ కోల్ బొగ్గు సరఫరా ఒప్పందాలను పర్దిమాన్ యూరియా, బ్లూవాటర్ పవర్ స్టేషన్ లతో చేసుకుంది. ఈ పాత ఒప్పందాలను గౌరవిస్తాయనే హామీతో గ్రిఫిన్ కోల్ ను ల్యాంకో కొనుగోలు చేసింది. కొన్న వెంటనే ల్యాంకో వైఖరిలో మార్పు వచ్చింది. అప్పటి ఒప్పందాలను తాము గౌరవించమని అధిక రేటు చెల్లిస్తేనే తిరిగి అ రెండు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని పేచి పెట్టింది. దీనికి ప్రధాన కారణం బొగ్గును అక్కడి ఈ రెండు సంస్థలకు విక్రయించేకన్నా దానిని మన దేశంలోని తన ప్లాంట్లకు ఉపయోగించుకుంటే ఎన్నోరెట్ల లాభం వస్తుందనే దురాశ. అలాకాక ఇండియాలో అ బొగ్గును విక్రయిస్తే టన్నుకు 30 డాలర్ల వరకూ లాభం వస్తుంది. లాభాల దురాశతో ల్యాంకో అనైతిక కార్యకలాపాలకు పూనుకుంది.
లాంకో దురాశను పసిగట్టిన పర్దిమాన్ యూరియా కంపెనీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టులో 17వేల కోట్ల నష్టపరిహారం కోరుతూ కేసు పెట్టింది. ఈ కేసులో ప్రాధమిక సాక్ష్యాదారాలు ఉండడంతో సుప్రీంకోర్టు ల్యాంకో యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. మొదట ల్యాంకో పర్దిమాన్ పై బెదిరింపులకు దిగింది. నష్టపరిహార దావాను ఉపసంహరించుకోకపోతే తాము కూడా పర్దిమాన్ పై కేసుపెడతామని హెచ్చరించింది. అయితే పర్దిమాన్ లొంగకపోవడంతో కేసువేసే ఆలోచన విరమించుకుంది. ఈ వివాదం కారణంగా దేశంలోని చిన్న మధ్య తరగతి షేర్ హోల్డర్లు ఇప్పటికే నష్టపోయారు. ఈ బొగ్గుగనిని కొనుగోలు చేయడానికి ముందు ఈ కంపెనీ షేరు విలువ రూ.42 ఉండేది వివాదం ఏర్పడిన తర్వాత ఒక దశలో ఎనిమిది రూపాయల 33 పైసలకు పడిపోయింది. ప్రస్తుతం 16 రూపాయల వద్ద నిలిచింది. ఈ వివాదం తర్వాత ల్యాంకో ఇన్ ఫ్రా టెక్ షేర్లు కొనుగోలు చేసిన చిన్న చిన్న మదుపరులు అపారంగా నష్టపోయారు.


