2014 ఎన్నికల్లో పోటీకి బాలయ్య సై!
Published on: Sun Jan 8, 2012 8:18AM
వి
జయవాడ: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు సై అన్నారు. 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని యువరత్న బాలకృష్ణ చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని పార్టీ నిర్ణయానికే వదిలేస్తున్నట్లు చెప్పారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణాలో ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానని, అదే సమయంలో పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా చేపడతానని తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం శనివారం ఆయన విజయవాడ వచ్చారు. పార్టీ దివంగతన నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు (పండు) కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇంతవరకూ కేవలం పార్టీ ప్రచారాలకే పరిమితమయ్యాననీ ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నాని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాలలోకి రావచ్చునని, ఇందులో ఒత్తిడి ఏమీ లేదని ఆయన చెప్పారు. మరో నాలుగేళ్లలో తన కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేస్తాడని అన్నారు. తను మాత్రం ప్రజాసేవకు అంకితమవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. టీడీపీ ఒక్కటే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని, ప్రజలు కూడా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ విషయంలో పార్టీ వైఖరే తన వైఖరని చెప్పారు. ప్రజలు ఎలా కోరుకుంటే అలాగే పార్టీ నడుచుకుంటుందన్నారు. అంతకు ముందు బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా విజయవాడ చేరుకున్నారు. నేరుగా చలసాని పండు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలకృష్ణ వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎంపీ గద్దే రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


