TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సారాలో మిథైల్ మోతాదు ఎక్కువ పరీక్షల్లో తేలిన నిజం

Published on: Mon Jan 2, 2012 10:23AM

విజయవాడ: కల్తీ సారాలో మిథైల్ మోతాదు ఎక్కువగా ఉండడం వల్లనే మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. నాటు సారాలో మిథైల్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లు లాబొరేటరీ పరీక్షల్లో తేలింది. కాగా, కల్తీసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. ఆ సారా కొల్లిమెర్లలో తయారైంది. కృష్ణా జిల్లా మైలవరం తండాల్లో శనివారం చోటు చేసుకున్న కల్తీ సారా విషాదానికి ఆదివారం ఉదయం నుంచి మరో ఐదుగురు మృత్యు ఒడికి చేరారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 26 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు బాధ్యులని భావిస్తున్న ఓ ఆబ్కారీ సిఐ, ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు.

కాగా, కల్తీ సారా ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించాయి. ప్రభుత్వంపై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసి సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.


కాగా, మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి మోపిదేవి, పార్థసారధిలు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. మట్టి ఖర్చుల కింద మరో రూ.10 వేలు ఇస్తామని, బాధిత కుటుంబాల్లో అర్హులు ఉంటే రాజీవ్ యువ కిరణాల పథకం కింద ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రివద్ద మృతుల కుటుంబాలు బైఠాయించారు.