కేసీఆర్ సారు.. ప్రధాని కారు

 

లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్ చెబుతున్న ఒకే ఒక్క మాట.. '16 సీట్లు గెలిపించండి కేంద్రంలో మనమే చక్రం తిప్పుదాం'. అంతేకాదు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి 'సారు.. కారు.. పదహారు' అనే నినాదం కూడా అందుకుంది. అయితే ఈ నినాదంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో 16 సీట్లు గెలిపిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్ మాటల్లో లాజిక్ లేదన్నారు. ఏపీలో జగన్ 20 నుంచి 22 ఎంపీ స్థానాలు గెలుస్తాడన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారని.. ఒకవేళ వైసీపీ నిజంగానే అన్ని సీట్లు గెలిస్తే.. టీఆర్ఎస్ చెప్పినట్టు ఎందుకు వింటుందని అన్నారు. టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ చక్రం తిప్పుతానంటే జగన్ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

పోనీ కేసీఆర్‌, జగన్‌ ఓ అవగాహనకు వచ్చినా.. తామూ ఎక్కువ సీట్లు సాధిస్తామంటున్న మమత, మాయావతి వంటి సీనియర్‌ నేతలు టీఆర్‌ఎస్‌ చెప్పుచేతల్లో పనిచేస్తారా? అని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల స్పీచ్‌లు చూస్తుంటే.. ఇలాంటి బేతాళ ప్రశ్నలకు జవాబే దొరకడం లేదన్నారు. లాజిక్ లేకపోవడం వల్లే కేటీఆర్ పదేపదే 'సారు.. కారు.. పదహారు' అంటున్నారని విమర్శించారు. ఇదంతా గమనిస్తే 'కేసీఆర్ సారు.. ప్రధాని కారు' అనే విషయం అర్థమవుతోందని విజయశాంతి ఎద్దేవా చేశారు.