గీతంకు వర్సిటీ హోదా తొలగించండి.. యూజీసీకి, హెచ్చార్డీకి ఎంపీ విజయ్ సాయిరెడ్డి లేఖ 

కొద్ది రోజుల క్రితం విశాఖలోని గీతం విద్యాసంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని చెబుతూ అక్కడి పలు నిర్మాణాలను విశాఖ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా గీతం ను మరోసారి టార్గెట్ చేస్తూ.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం యూజీసీ నిబంధనలను కూడా అతిక్రమించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కు లేఖ రాశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో అయన కోరారు. దీనితోపాటు గీతం యూనివర్సిటీకి ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ హోదాను యూజీసీ రద్దు చేయాలనీ, అయితే విద్యార్థులు మాత్రం నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా చేయొచ్చని అయన పేర్కొన్నారు.

 

గీతం సంస్థ విశాఖ క్యాంపస్‌ కోసం ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తన దృష్టికొచ్చిందని సాయిరెడ్డి తెలిపారు. క్యాంపస్‌ కోసం నిబంధనలు ఉల్లంఘించి భూములు సేకరించారని సాయిరెడ్డి ఆ లేఖలో ఆరోపించారు. గీతం సంస్థ నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు బహిర్గతం చేయకపోవడంపై అభ్యంతరం తెలిపారు. యూజీసీ చట్టంలోని పలు నిబంధనలను గీతం ఉల్లంఘించినట్లు సాయిరెడ్డి ఆరోపించారు. గీతం విద్యా సంస్థకు.. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీ భరత్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసందే.