సంబంధంలేని విషయాల్లో కాలు, వేలు ఎందుకు పెడతావు బాబు: విజయ్ సాయి రెడ్డి

విజయనగరం సంస్థానానికి సంబంధించిన మాన్సస్ ట్రస్ట్ విషయమై వైసిపి, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. కొద్దీ రోజుల క్రితం వరకు ట్రస్ట్ చైర్మన్ గా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఉండగా వైసిపి ప్రభుత్వం అయనను తప్పించి ఆనంద్ గజపతి రాజు కుమార్తె సంచయిత ను చైర్మన్ గా చేసింది. దీంతో అటు టీడీపీ ఇటు వైసిపి నాయకులు మీరు ఆస్తులు దోచేశారంటే కాదు మీరే దోచేశారంటూ విమర్శించుకుంటున్నారు.

తాజాగా వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఇదే విషయమై నిన్న వైసిపి ప్రభుత్వం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. "విజయనగరం గజపతుల కుటుంబ వ్యవహారాలు, ట్రస్టులో జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు. ఇన్నాళ్లు జోక్యం చేసుకుని దోచేసింది నువ్వే " అని చంద్రబాబు పై ఆరోపణలు చేశారు. అంతే కాకుండా "సంబంధం లేని విషయాల్లో కాలు, వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటావ్ చంద్రబాబూ" అని ప్రశ్నించారు. "సంచైత గజపతుల కుటుంబ సభ్యురాలు కాదా? లేదా మహిళలంటే నీకు చిన్న చూపా?" అని ప్రశ్నించారు.

ఇదే సందర్భంలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనవాసరావుపై కూడా ఆరోపణలు చేశారు. "తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!' అని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు సైకిళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం లో అవినీతి చోటుచేసుకుందని విరుచుకు పడ్డారు.