తీవ్ర ఉద్రిక్తత మధ్య రామతీర్థంలో చంద్రబాబు పర్యటన
Published on: Sat Jan 2, 2021 1:04PM
విజయనగరం జిల్లా రామతీర్థంలో పురాతన రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెల్సిందే. ఏపీలోని ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని ప్రతిపక్షాలు మండిపడుతుండగా... ఇది టీడీపీ పనే అని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలిని పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుండి రామతీర్థంకు బయల్దేరారు. మరి కొద్దిసేపట్లో ఆయన రామతీర్థం చేరుకోబోతుండగా.. మరోవైపు విజయసాయిరెడ్డి అంతకు ముందే బోడికొండకు చేరుకుని, రామతీర్థం ఆలయానికి చేరుకున్నారు. దీంతో, రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత పరిష్టితులు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉండగా బోడికొండ కింద ఇప్పటికే టీడీపీ, బీజేపీ, వైసీపీ శ్రేణులు టెంట్లు వేసుకున్నాయి. బీజేపీ శ్రేణులతో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు కొంత మంది సాధువులు కూడా ఉన్నారు. మరోవైపు రామతీర్థంకు వెళ్తున్న విజయసాయిని బీజేపీ, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కొండపైకి వెళ్లే అర్హత విజయసాయికి లేదని వారు మండిపడ్డారు. గోబ్యాక్ విజయసాయిరెడ్డీ అంటూ నినాదాలు చేసారు. మరోపక్క జైశ్రీరాం నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగుతోంది. అయితే, పోలీసుల అండతో విజయసాయిరెడ్డి కొండపైకి బయల్దేరారు. ఆ ప్రాంతంతో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీ ఎత్తున ఆ ప్రాంతంలో మోహరించారు. అయితే ఇప్పటివరకు రామతీర్థంతో పాటు ఇతర ఆలయాల దాడులపై సరిగా స్పందించని ప్రభుత్వం, వైసీపీ నేతలు ఇపుడు చంద్రబాబు పర్యటనకు వస్తుండడంతో విజయసాయిరెడ్డి హడావిడిగా పర్యటన చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


