రాజ్యసభ ‘చైర్’లో విజయసాయిరెడ్డి
Published on: Fri Aug 5, 2022 1:23PM
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త అవతారం ఎత్తారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఆయన రాజ్యసభ స్పీకర్ వెంకయ్యనాయుడు, డిప్యూటీస్పీకర్ రాజ్యసభ సమావేశానికి అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానాన్ని విజయసాయి రెడ్డి భర్తీ చేశారు. సాధారణంగా ఉప రాష్ట్రపతే పెద్దలసభ స్పీకర్‌గా ఉంటారు.
ఆయన లేని సమయంలో డిప్యూటీ చైర్మన్ ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. కానీ రాజ్యసభ సమావేశానికి స్పీకర్, డిప్యూటీ ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో ఆ అవకాశం అనూహ్యంగా విజయసాయిరెడ్డికి వచ్చింది. చైర్ లో విజయసాయి కూర్చున్న సమయంలో విపక్ష నేత మల్లికార్జన్ ఖర్గే మాట్లాడుతూ ఒక ఎంపీనైన తనను పార్లమెంటు సెషన్ జరుగుతుండగా ఈడీ విచారణకు పిలిచిందనీ, ఇదేమి నైతికత అని ప్రశ్నించారు.
దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈడీ స్వంతంత్ర వ్యవస్థ అనీ ఎవరైనా సరే ఈడీ ఆదేశాలనుపాటించాల్సిందేననీ పేర్కొన్నారు. అయితే గోయెల్ సమాధానం పట్ల విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. చైర్ లో కూర్చున్న విజయసాయి సభను నియంత్రించడంలో చాలా ఇబ్బంది పడ్డారు.


