విజయనగరంలో డి-పట్టా భూములకు టెండరు
Published on: Mon Feb 13, 2012 3:08PM
ఇష్టానుసారంగా కొనుగోలుచేస్తున్న 'చీఫ్' అనుయాములు
విజ
యనగరం: విజయనగరం జిల్లాలో నిరుపేదలకు చెందిన డి - పట్టా భూములన్నీ బడాబాబులు కైంకర్యం చేసుకుంటున్నారు. దీనికి అధికార పార్టీకి చెందిన చీఫ్ ఒకరి అండదండలు ఉన్నాయని తెలుస్తుంది. విజయనగరం జిల్లా పారిశ్రామిక కేంద్రంగా మారుతుండటంతో ఆ జిల్లాలో భూములకు అమాంతం రెక్కలు వచ్చాయి. దీంతో ఆ చీఫ్ తన అనుయాయులతో డి-పట్టా భూములు ఎక్కడ ఉంటే అక్కడ కొనమని భారీగా డబ్బులు పంపుతున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం విజయనగరం మండలం గాజులరేగ గ్రామంలో బంటి నారాయణ అనే దళితుడికి చెందిన నాలుగు ఎకరాల డి-పట్టా భూమిని చీఫ్ అనుయాయులు అతి తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. ఇటివల కాలంలో వీరు దాదాపు 112 ఎకరాల డి-పట్టా భూములను కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ భూములు కొనుగోలుదారుల పేరున రిజిష్టరు కానప్పటికీ భూమి యజమాని నుంచి స్వాధీన అగ్రిమెంట్ పవరాఫ్ అటానీలు పకడ్బందీగా రాయించుకుంటున్నారు. అంతేకాక వీరు ఎప్పుడైనా ఎదురు తిరుగుతారనే భయంతో పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చినట్లుగా ప్రామిసరీ నోట్లు రాయించి ముందు జాగ్రత్త చర్యలుగా చెక్కులు కూడా తీసుకుంటున్నారు. కొంతకాలంపోయిన తరువాత ప్రత్యేక జీవోలతో వీటిని కొనుగోలుదారుల పేరిట రిజిష్టర్ చేయించవచ్చుననేది ఆ చీఫ్ గారి వ్యూహంగా తెలుస్తోంది.


