వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా
Published on: Fri Jul 8, 2022 1:26PM
సంచలనం ఏమీ లేదు.. అనూహ్యమేమీ సంభవించలేదు. అంతా పక్కాగా, జగన్ స్క్రిప్టు ప్రకారమే జరిగిపోయింది. ప్లీనరీ వేదికగా వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ వైదొలిగారు. పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ విజయమ్మ రాజీనామాతోనే ఆరంభమౌతుందని తెలుగు వన్ ముందే చెప్పింది. అదే విధంగా జరిగింది.
అయితే తన రాజీనామా ప్రకటన సందర్భంగా విజయమ్మ మాట్లాడిన మాటలే ఒకింత నర్మగర్భంగా ఉన్నాయి. కన్న తల్లిగా తన మద్దతు తన బిడ్డలిద్దరికీ ఉందని చెబుతూనే తన భర్త వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం తెలంగాణ కోడలిగా తన కూతురు చేస్తున్న కృషికి మద్దతివ్వాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.
జగన్ సమక్షంలోనే ఆమె ప్రసంగించారు. తెలంగాణ వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించి తెలంగాణలో వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న షర్మిలకు అండగా నిలవడం కోసమే తాను వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగలేనని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
విజయమ్మ రాజీనామా ప్రకటన అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగలేనంటూ చేసిన వ్యాఖ్య సంచలనంగా మారాయి. ఎంత జగన్ స్క్రిప్ట్ ప్రకారమే రాజీనామా ప్రకటన చేసినా.. ఆ ప్రకటన సందర్భంగా చేసిన ప్రసంగంలో మాత్రం ప్రస్తుత పరిస్థితులు అంటూ చేసిన వ్యాఖ్యలను విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. రాజీనామా కోసం ఆమెపై వచ్చిన ఒత్తిడికి ఆ వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషిస్తున్నారు.


