TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు ప్రజలతో ఆడుకొంటున్న రాజకీయ పార్టీలు

Published on: Wed Aug 28, 2013 9:04PM

 

వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర విభజనలో సమన్యాయం చేయాలంటూ తన పార్టీ నేతలతో కలిసి బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు గంటలసేపు ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వపాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజలెవరూ సంతోషంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తన భర్త స్వర్గీయ రాజశేఖరరెడ్డి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొన్నారని, అయితే ప్రస్తుతం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయని, తత్ఫితంగా రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని ఆమె అన్నారు.

 

తెలుగు ప్రజల సమైక్యకృషి కారణంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను ఇప్పుడు విభజన కారణంగా ఎందుకు వదులుకోవాలని ఆమె ప్రశ్నించారు. అందరి కృషి కారణంగా అభివృద్ధి అయిన నగరాన్ని ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే ఎలా కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు.

 

విజయమ్మతో సహా నేడు కాంగ్రెస్, తెదేపా నేతలు సైతం అడుగుతున్నఈ ప్రశ్నలు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు అడిగి ఉంటే, ఆ పార్టీల నిబద్ధతపై రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం కలిగి ఉండేది. కానీ, ఆవిధంగా అడిగితే అది తెలంగాణా వ్యతిరేఖతగా ప్రచారమయితే అక్కడ తమ పార్టీలు ఎక్కడ నష్టపోతాయనో భయంతో నాడు అందరూ మౌనం వహించారు తప్ప ఈ సందేహాలన్నీనాడు వారికి లేవని కాదు. నేడు రాష్ట్రం యొక్క, ప్రజల యొక్క దైన్య స్థితి గురించి బాధపడుతూ మొసలి కన్నీరు కారుస్తున్న ఈ రాజకీయ నేతలకు, నిజంగా తమ పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఉంటే ఆనాడే దైర్యంచేసి వివిధ అంశాలపై నేడు లేవనెత్తుతున్న ధర్మసందేహాలను అడిగి ఉంటే నిజంగానే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిఉండేది కాదు. అంతే కాకుండా ఈ అంశాలపై ఈపాటికి ఒక స్పష్టత కూడా వచ్చి ఉండేది.

 

ఆనాడు తెలంగాణా ఉద్యమాల వల్ల తమ పార్టీలపై ఏర్పడిన తీవ్ర ఒత్తిళ్ళ నుండి తాత్కాలికంగా బయటపడే ఉద్దేశ్యంతో, తాము రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చినప్పటికీ కేంద్రం ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణా ఇవ్వలేదని వారు బలంగా నమ్మినందునే లేఖలు ఇచ్చారు. తెలంగాణాలో తమ పార్టీలు నష్టపోకూడదనే ఆలోచనతోనే నాడు అఖిలపక్షంలో నోరు మూసుకొని కూర్చొని వచ్చారు.

 

తమ ఈ నిర్వాకాన్నిఅంతా నేర్పుగా కప్పిపుచ్చుకొంటూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మిగిలిన పార్టీల వైపు వేలెత్తి చూపుతూ ఇంకా ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. అందుకే నేడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం చేస్తున్న ప్రజల వద్దకు సదరు నేతలు దైర్యంగా వెళ్ళలేకపొతున్నారు. వెళ్ళిన ప్రతీ ఒక్కనేతకీ భంగ పాటు తప్పడం లేదు. ప్రజలు రాజకీయ నాయకుల మాటలను నమ్మడం లేదని ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది. యినప్పటికీ నిరాహార దీక్షలు, ధర్నాలు, యాత్రలు చేయడం ద్వారా ప్రజలను సులువుగా మభ్యపెట్టవచ్చుననే భ్రమలో ఉండటం విశేషం.

 

ఇప్పటికయినా రాజకీయ నేతలు, పార్టీలు విజ్ఞత ప్రదర్శించి రాష్ట్రం మళ్ళీ గాడినపడేలా చేయగలిగితే ప్రజలే వారికి పట్టం కడతారు. లేకుంటే అందుకు వారు భారీ మూల్యం చెల్లించక తప్పదు.