రాష్ట్ర విభజనపై రాజకీయ పార్టీల అనుచిత వైఖరి

 

ఇవాళ రేపు ఆమరణ నిరాహార దీక్ష అంటే దీక్ష చేస్తున్న వ్యక్తి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయేంతవరకు, అంటే మహా అయితే ఐదు లేక ఆరు రోజుల తరువాత పోలీసులు వచ్చి భగ్నం చేసేంత వరకు దీక్ష చేయడం, అనే ఒక సరికొత్త ఒరవడి మొదలయింది. గనుక నేడు రాష్ట్రంలో చాల మంది రాజకీయ నేతలు ఈ ఐదారు రోజుల ఆమరణ నిరాహార దీక్షలకు కూర్చొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 

వైకాపా గౌరవధ్యక్షురాలు విజయమ్మ ఐదు రోజుల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయగానే, ఆ పార్టీకి చెందిన నేతలు కొణతాల రామకృష్ణ, భూమన నాగిరెడ్డి, ధర్మాన కృష్ణ దాసు తదితరులు హడావుడిగా చంచల్ గూడా జైలుకి పరుగులు తీసి, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలిసివచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుండి జగన్ మోహన్ రెడ్డి జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. బహుశః ఈ దీక్ష కూడా కూడా విజయమ్మ దీక్షలాగే ఐదారు రోజుల్లో ముగియవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా ఈ ఆమరణ నిరాహార దీక్షా పోటీలలో పాల్గోననప్పటికీ, సమైక్య ఉద్యమంలో వారి పాత్రను బాగానే పోషిస్తున్నారు. సమైక్యాంధ్ర, సమన్యాయం అంటూ పోటాపోటీలుగా రెండు పార్టీల నేతలు ఉద్యమిస్తున్నపటికీ, వారు తమ ప్రత్యర్ధుల కంటే తామెక్కడ వెనుకబడిపోతామనే భయంతో, తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకొనేందుకే ఉద్యమిస్తున్నట్లు వారి చేతలతో, ప్రసంగాలతో స్పష్టం అవుతోంది. అయితే, విజయమ్మ, జగన్ మోహన్ రెడ్డిల దీక్షలు మాత్రం పార్టీ శ్రేణులను ప్రోత్సహించి తద్వారా సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని బలపరచుకోవడానికేనని చెప్పవచ్చును.

 

రాజకీయ నేతలు ఈవిధంగా తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఉద్యమాలు దీక్షలు చేస్తూ రాష్ట్రంలో అశాంతికి మూలకారణం అవుతున్నారు. రాష్ట్ర విభజన వంటి ఒక సంక్లిష్టమయిన సమస్యను సజావుగా పరిష్కరించడానికి కృషి చేయవలసిన రాజకీయ పార్టీలు, ఈవిధంగా అనుచితంగా ప్రవర్తిస్తూ తిరిగి కేంద్ర ప్రభుత్వాన్నే నిందించడం రాజకీయ దౌర్భాల్యమే.

 

వివేకం ప్రదర్శించవలసిన తరుణంలో ఈవిధంగా ఆవేశం, అసహనం ప్రదర్శించడం వలన సమస్య మరింత జటిలమవుతుందే తప్ప పరిష్కారం కాబోదు. ఈసంగతి అన్ని రాజకీయ పార్టీలకి స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకంటే తమ స్వార్ధరాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత నీయడం చాలా దారుణం. ఆవిషయం దాచిపెట్టి తాము ప్రజలకోసమే ఉద్యమిస్తున్నట్లు నటిస్తూ ప్రజలను కూడా మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు రాజకీయ పార్టీలను గుడ్డిగా నమ్ముతున్నంత కాలం అవి ఈవిధంగానే ప్రవర్తిస్తాయి.గనుక ముందుగా మేలుకోవలసింది ప్రజలే.