విజయమ్మ దీక్ష సమైక్యం కోసమేనా

 

వైకాపా అధ్యక్షురాలు విజయమ్మరాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ గుంటూరులో చేప్పటిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో ఐదవరోజు పూర్తయింది. షరా మామూలుగానే ఆమె షుగర్, బీపీ, లెవెల్స్ పడిపోవడం, నీరసించిపోవడం, వెంటనే దీక్ష విరమించమంటూ డాక్టర్ల హెచ్చరికలు అన్నీ మొదలయిపోయాయి. ఇక నేడో రేపో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమె దీక్షను భగ్నం చేయడం ఆసుపత్రికి తరలించడం కూడా షరా మామూలుగా జరిగేవే.

 

ఆమె రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ దీక్ష మొదలుపెట్టినప్పటికీ, అక్కడ జరుగుతున్న రాజకీయ ప్రసంగాలు మాత్రం తెదేపాను దాని అధ్యక్షుడు చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని సాగుతుండటం విశేషం. ఈ రోజు దీక్షా వేదిక వద్ద ప్రసంగించిన ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ రాష్ట్ర విభజన వల్ల కలిగే కష్టనష్టాల గురించి, రాష్ట్రం విడిపోకుండా ఉంచేందుకు చేయవలసిన ప్రయత్నాల గురించి మాట్లాడే బదులు, ఆమె చంద్రబాబుపై నిప్పులు చెరగడానికే ప్రాధాన్యమిచ్చారు.

 

రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని, ఇప్పటికయినా ఆయన తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని రాష్ట్ర విభజను వ్యతిరేఖిస్తే కేంద్రం తప్పక దిగివస్తుందని ఆమె అన్నారు. తెలంగాణకు అనుకూలమని చెపుతూ, మరో వైపు సీమాంధ్ర నేతల చేత సమైక్య ఉద్యమాలు చేయించడం ప్రజలను మోసగించడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం ఇప్పటికయినా ఆయన ద్వంద నీతిని పక్కనబెట్టి ఆయన తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆమె డిమాండ్ చేసారు.

 

తెలంగాణాలో పాగా వేసేందుకే ‘తెలంగాణా ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని’ చెప్పుకొన్న వైకాపా అక్కడ, పార్టీకి ఆశించినంతగా ప్రజాదరణ దక్కకపోవడంతో ఇక అక్కడ కొనసాగి లాభంలేదని గ్రహించగానే అకస్మాత్తుగా సమైక్యరాగం అందుకొని, అక్కడి తన పార్టీ నేతలని, ప్రజలని మోసం చేయడం నిజం కాదా? విశ్వసనీయతకు సర్వహక్కులు తమవేనన్నట్లు మాట్లాడే ఆ పార్టీ అధిష్టానం తెలంగాణా ప్రజలను వంచించడం నిజం కాదా? తెలంగాణా విషయంలో ఆ పార్టీ అవలంభించినది ద్వంద వైఖరి కాదా?

 

తెలంగాణాలో పూర్తిగా పరువు పోగొట్టుకొని, ఏమీ జరగనట్లుగా ఆంధ్రప్రాంతంలో ఈవిధంగా ఉత్తర ప్రగల్భాలు పలకడం ఆ పార్టీకే చెల్లు. నిజానికి ఆ పార్టీకి ఇప్పుడు ముఖ్యంగా కావలసింది నిబద్దత, విశ్వసనీయతే. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడుతున్నామని చెపుతూ ఆ పేరుతో సీమాంధ్ర ప్రాంతంలో తమ పార్టీ రేటింగ్ పెంచుకోవాలని తహతహలాడుతున్న వైకాపా మళ్ళీ ద్వందనీతినే అవలంభిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని బలపరుచుకొంటూ, తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నవైకాపా సమైక్య ఉద్యమాల పేరుతో ప్రజలని వంచించడం చాలా హేయమయిన చర్య.

 

సీమాంధ్ర ప్రాంతంపై పూర్తి పట్టు సాధించేందుకే రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమాలు మొదలుపెట్టిన వైకాపా, ఆ తరువాత చంద్రబాబుని ముగ్గులోకి లాగేందుకే జగన్, విజయమ్మల రాజీనామాలు చేసి ఇప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించడం గమనిస్తే ఆ పార్టీ ఎంత దురాలోచనతో ఈ సమైక్యపోరాటం ఆరంభించిందో అర్ధం అవుతోంది. ఇటువంటి దుర్నీతితో పార్టీ ప్రజల మెప్పు పొందడం, కలకాలం మనుగడ సాగించడం అసంభవమని ఆ పార్టీ అధిష్టానం ఎంత త్వరగా గ్రహిస్తే ఆపార్టీకి అంత మేలు.