రామోజీ రావుని ఎందుకు కలిసావో చెప్పే ధైర్యం ఉందా బాబూ?

 

వైసీపీ నేత విజయసాయి రెడ్డి.. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. సర్ కాటన్ దొర జయంతి సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన స్ఫూర్తితో పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. "పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయకు చంద్రబాబూ. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి చరిత్ర పురుషుడయ్యారు. తమరేమో నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును ఏటిఎంలాగా మార్చుకుని వేల కోట్లు మింగారు." అని విమర్శించారు.

ఈ నెల 19 న వచ్చే ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా వస్తాయని.. అవి చూసి ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఖచ్చితంగా మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబు టీడీపీ నేతలతో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. "తను చేయించిన 4 సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని తేలినట్టు చెప్పిన చంద్రబాబు.. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దనడం వింతగా ఉంది. ఏ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవద్దంటే అర్థం చేసుకోవచ్చు. మీడియా ఇంతగా విస్తరించిన తర్వాత దేన్ని నమ్మొచ్చే దేన్ని పట్టించుకోకూడదో ప్రజలందరికీ తెలుసు." అని పేర్కొన్నారు.

చంద్రబాబు రామోజీరావుతో భేటీ అవ్వడంపై కూడా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. "ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి ఆయనను  కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ?" అని విమర్శించారు.