గెలుపుపై బాబుకి నమ్మకం లేదు.. పెట్టేబేడా సర్దుకుని పోవడమే

 

ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడానికి ట్విట్టర్ ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉపయోగించినట్లుగా ఎవరూ ఉపయోగించరేమో. రోజూ పదుల సంఖ్యలో ట్వీట్లు చేస్తారు. వాటిలో దాదాపు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ విమర్శలే ఉంటాయి. తాజాగా విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

"మళ్లీ గెలుస్తాననే భరోసా ఉంటే ఐదేళ్ళు టైం దొరకదని మనవడిని తీసుకొని దేశాలు తిరిగొచ్చేవారు చంద్రబాబు. ఆ నమ్మకం లేకపోవడం వల్లే ఆఖరి అధికార ఘడియలు సీఎం కుర్చీలో గడుపుతున్నారు. పైసా పనిలేకున్నా ఆఫీసుకు ఠంచనుగా వెళ్లడం చూస్తే తెలియడం లేదా సార్ పరిస్థితి ఏమిటో?" అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

"అమరావతిలోని ‘ప్రజావేదిక’ ప్రభుత్వ ప్రాంగణం. టీడీపీ కార్యక్రమాల కోసం చంద్రబాబు ఇప్పటి వరకు దానిని  దుర్వినియోగం చేస్తూ వచ్చారు. కోడ్‌ అమలులో ఉన్నా తాను ఆపద్ధర్మ సీఎం అని మర్చిపోయి అదే  ప్రజావేదికలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళినే హేళన చేస్తున్నారు." అంటూ చంద్రబాబు తమ పార్టీ నేతలతో నిర్వహిస్తున్న సమీక్షలపై విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.

‘‘సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఎలాగైనా ఇరికించేందుకు ఒత్తిళ్లు మొదలు పెట్టారు బాబు అండ్‌ కో. పునేఠా ఇప్పటికే బలిపశువయ్యాడు. కోడ్ అమలులో ఉన్నా మంత్రివర్గానికి జవాబుదారీగా ఉండాలని ఎల్వీని బెదిరిస్తున్నారు. నాలుగు రోజుల్లో పెట్టేబేడా సర్దుకుని పోయేవారిని పట్టించుకోనవసరం లేదు.’’ అని అన్నారు.

‘‘ఈవీఎంలపై చంద్రబాబు మతితప్పి మాట్లాడుతుంటే దాన్నిబలపరుస్తూ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఘోర పరాజయం తర్వాత ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండు చేసినా ఆశ్చర్యం లేదు. పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేసిన 80 శాతం మంది ప్రజలకు లేని అనుమానాలు తుప్పు బాబుకు వస్తున్నాయి.’’ అని విజయసాయి రెడ్డి విమర్శించారు.