ఇక మీదైనా నోటిపై అదుపు పాటిస్తారో లేదో… విజయ‘సారీ’రెడ్డి!

రాజకీయం వేరు, రచ్చ వేరు. అలాగే, వ్యాపారం , లెక్కలూ వేరు. పార్లమెంట్, చట్ట సభల్లో చర్చలు కూడా వేరు! ఈ సత్యం వృత్తి రిత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయి రెడ్డికి ఇవాళ్లే బోధపడి వుంటుంది! ఆయన రాజ్యసభలో అందరి ముందూ బేషరతుగా చైర్మన్ వెంకయ్య నాయుడికి సారీ చెప్పారు. అలా చెప్పే పరిస్థితి నిన్న ఆయన తన స్వంత మాటలు, చేష్టలు కారణంగానే తెచ్చుకున్నారు. బహుశా ఇప్పటికైనా విజయసాయికి పెద్దల సభ అంటే తమ పార్టీ కార్యాలయం కాదని అవగాహనకు వచ్చి వుంటుంది!

 

 

విజయసాయి రెడ్డి కొన్నాళ్ల కిందటి దాకా జగన్ వ్యాపారపు లెక్కలు చూసుకునే సీఏ మాత్రమే. అయితే కామర్స్ తెలిసిన ఈయన అంతకంటే ఎక్కువ ప్రతిభ ప్రదర్శించారు. అందుకే, అనేక కేసుల్లో జగన్ ఏ వన్ అయితే ఈయన ఏ టూ అయ్యారు! అలా వైసీపీ అధినేతకి ఇతోధికంగా సహకరించిన విజయసాయి రాను రాను పార్టీలో కీలకమైపోయారు. మరీ ముఖ్యంగా, రాజ్యసభలో వైసీపీ ఎంపీగా కాలుపెట్టాక రెడ్డిగారి దూకుడు మరింత పెరిగింది. దిల్లీలో జగన్ కంటే ఎక్కువ ఈయనే పాప్యులర్ అయిపోయారు. ప్రధాని మోదీని ఓ సీఎం అయిన చంద్రబాబు కలవటం కష్టమైనా విజయసాయి మాత్రం అమాంతం కలిసేస్తుంటారు. అంతలా చక్రం తిప్పుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కమలదళానికి కావాల్సినంత సేవలందించారు. ఇదంతా రహస్యం కూడా కాదు. బహిరంగమే!

 

 

పార్టీలో జగన్ తరువాత అత్యంత కీలకమైన స్థానంలోకి వచ్చిన విజయసాయి రాజ్యసభ అంటే అదేదో ప్రెస్ మీట్ అనుకున్నారో ఏమో కానీ ఏకంగా చైర్మన్నే టార్గెట్ చేసుకున్నారు! మన తెలుగు వారే అయిన మోస్ట్ సీనియర్ పొలిటీషన్ వెంకయ్య నాయుడు చైర్ లో వుండగా నిన్న విజయసాయి రెడ్డి అలిగారు. వాకౌట్ చేశారు. తనకు సరిగ్గా మాట్లాడే టైం ఇవ్వలేదని నిరసన తెలిపారు. ఇంత వరకూ ఓకే! కానీ, ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య తన పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తుననారని ఆనేశారు! దీని ఎఫెక్ట్ ఎలా వుంటుందో బహుశా నిన్న ఆయనకు అంచనా లేకపోవచ్చు!

 

 

విజయసాయి నోటి దురుసు తెలుగు వారికి కొత్తేం కాదు. ఆయన ప్రతీ రెండు రోజులకి ఒకసారి చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిడుతుంటారు. అయితే, అదంతా ప్రెస్ వారి మైకుల ముందు. కానీ, అలాంటి ప్రవర్తనే సభలో ప్రదర్శిస్తే ఎలా? అదీ జాతీయ స్థాయి పెద్దల సభ అయిన రాజ్యసభలో … నేరుగా చైర్మన్ ను ఉద్దేశించి అనాలోచితంగా మాట్లాడటం ఏంటి? తాను చేసిన తప్పు అర్థమైన వెంటనే విజయసాయి నిన్ననే వెంకయ్య వద్దకి వ్యక్తిగతంగా వెళ్లి సారీ చెప్పారట. అయితే, ఇవాళ్ల ఉదయం రాజ్యసభలో మళ్లీ ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. చైర్మన్ పై విమర్శల గురించి వివరణ ఇచ్చుకునే అవకాశం వచ్చింది. కానీ, మరోమారు తాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ … రాగం తీసే సరికి వెంకయ్య నాయుడు విజయసాయి మాటల్ని మధ్యలోనే కట్ చేసి ఇతరులకి మాట్లాడే అవకాశం ఇచ్చేశారు. దీంతో వ్యవహారంలోని సీరియస్ నెస్ అర్థం చేసుకున్న మన సీఏగారు వివరణలు ఇవ్వటం మానేసి… బేషరతుగా సభకు సారీ చెప్పారు!

విజయసాయి రెడ్డి రాజ్యసభలో సారీ చెప్పటం పెద్ద అవమానమో, నష్టమో కాదు. కానీ, ఆయన ఇప్పటి నుంచైనా నోటి మీద అదుపు ప్రదర్శిస్తే ఎంతో మంచిది. తెలుగు జాతి గర్వించేలా ఎదిగిన వెంకయ్యనే దేశం మొత్తం ముందు పక్షపాతి అనటం … ఏ విధంగానూ వివేకం కలిగిన పని కాదు. ఇలాంటివి జనంలో విజయసాయిని, ఆయన పార్టీని చులకన చేస్తాయి తప్ప మరే లాభమూ వుండదు!