జగన్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా విజయసాయి రెడ్డి

 

ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. రాజకీయ విశ్లేషకులు కూడా వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఫలితాలు రాకముందే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. నిజానికి వైసీపీ శ్రేణులు తమదే అధికారమని మొదటి నుంచి నమ్మకంగా చెబుతున్నాయి. వైఎస్ జగన్ పేరుతో సీఎం నేమ్ ప్లేట్, జగన్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం, జగన్ డ్రీం కేబినెట్ లిస్ట్.. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని పరిశీలిస్తే చాలు.. గెలుపుపై వైసీపీ శ్రేణులు ఎంత నమ్మకంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారన్న చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కీలక నేత విజయసాయి రెడ్డిని జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకొని కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వైసీపీలో నెంబర్ 2 అంటే విజయసాయి రెడ్డి గుర్తుకొస్తారు. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న విజయ సాయి రెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. అందుకే జగన్.. వైసీపీ అధికారంలోకి వస్తే విజయ సాయి రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలి అనుకుంటున్నారట. అయితే విజయ సాయిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా తీసుకోవాలన్న ప్రయత్నాల్లో జగన్ ఉన్నట్లు సమాచారం.

ఇక ఎంతో కీలకమైన స్పీకర్ పదవిని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవికి అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మొదట్నుంచి తన వెంటే ఉన్న కొంతమంది నాయకులకు కూడా తన కేబినెట్‌లో జగన్ చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని తదితరులకు పదవులు దక్కవచ్చని వైసీపీలో చర్చ జరుగుతోంది.