అందుకే చంద్రబాబుకి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు...

 

నేను ఢిల్లీ 29 సార్లు వెళ్లానని.. ప్రధాని మోడీ మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు తనకి మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు కానీ... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రం అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తున్నారని... బీజేపీ వైసీపీకి ఫేవర్ గా ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి అని మండిపడేవారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన విజయసాయిరెడ్డి మోడీ చంద్రబాబుకి ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదో చెప్పుకొచ్చారు. అవసరాన్ని బట్టి పూటకో మాటను మార్చడం చంద్రబాబు నైజమని.. రంగులు మార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించినవారు మరెవరూ లేరని విమర్శించారు. అంతేకాదు.. గతంలో రాత్రికి రాత్రే ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనని చంద్రబాబు స్వాగతించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదు.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ డ్రామాలాడుతున్నారని అన్నారు. అవిశ్వాసంపై చంద్రబాబు ఎలా మాట మార్చారో కూడా అందరికీ తెలుసు.. చంద్రబాబు తన నీడను తానే నమ్మలేరని... ఇంకా చెప్పాలంటే కన్న కొడుకు నారా లోకేష్ ను కూడా ఆయన నమ్మడం లేదని చెప్పారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రయోజనం లేదని, ప్రధాని అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెబుతున్నారు... రంగులు మార్చే నైజం చంద్రబాబుది కాబట్టే మోదీ ఆయనను విశ్వసించలేదు... అందుకే చంద్రబాబుకి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు అని కామెంట్ చేశారు.