జగన్ మదినిండా విజయసాయే..?

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి వైసీపీ అధినేత జగన్ పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్..మరోవైపు ఎమ్మెల్యేల జంపింగ్‌లు ఇలా ఏ వైపు ఫోకస్ చేయాలా అనే దానిపై జగన్ ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా అదే సమయంలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్. ఈ తరుణంలో పెద్దల సభకు ఎవరిని పంపించాలా అన్న మిగిలిన పార్టీలన్ని తర్జనభర్జనలు పడ్డాయి. కాని జగన్‌కు మాత్రం ఆ తలనొప్పులు లేవు. ఎందుకంటే దీని కోసం జగన్ భారీ కసరత్తులు, చర్చలు ఏం జరపలేదు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న తన మనసులో మాటనే అధికారికంగా ప్రకటించారు.

 

ఉదయం వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును ప్రకటించారు. అనంతరం  పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో పార్టీ వాణిని వినిపిస్తానని, తన ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్ కాంగ్రెస్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డే రాజ్యసభ అభ్యర్థి అని పార్టీ నేతందరికి ఎప్పుడో తెలుసు. సీనియర్లు దాడి వీరభద్రరావు, మైసూరా రెడ్డి లాంటి వారు పెద్దల సభకు వెళదామని అనుకున్నప్పటికి అసలు విషయం బోధపడేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ విషయంపై ఒకటికి రెండు సార్లు అధినేతను అడిగినప్పటికి జగన్ మదిలో విజయసాయి తప్ప ఎవరూ లేరని అర్థమైంది. అందుకే మూటముల్లే సర్దేసుకుని జగన్‌కు తలాక్ చేప్పేశారు. మరి పార్టీని కష్టకాలంలో నడిపించిన వారు కూడా గుర్తులేనంతగా విజయసాయి, జగన్‌కు చేసిన సాయమేమిటో...?