విజయ్ మాల్యా పారిపోయాడో
Published on: Wed Mar 9, 2016 4:15PM
.jpg)
అనుకున్నదంతా అయ్యింది! కడుపుకాల్చుకుని, కన్నీళ్లు దాచుకుని, రూపాయి రూపాయి కూడబెట్టి మనం బ్యాంకుల్లో దాచుకుంటే... ఆ బ్యాంకుల్లో ఉన్న సొమ్ముని కాస్తా ఓ సోగ్గాడు ఎత్తుకుపోయాడు. అధికారిక లెక్కల ప్రకారం తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టి మరీ విజయ్ మాల్యాగారు విమానంలాగా ఎక్కడికో ఎగిరిపోయారు. ‘విజయ్ మాల్యాను దేశం విడిచి పోకుండా చూడండి’ అని ప్రభుత్వరంగ బ్యాంకులు వేసిన కేసులో ప్రభుత్వం తరఫున న్యాయవాది పేల్చిన బాంబు ఇది. తాము విజయ్ మాల్యా గురించి సీబీఐను సంప్రదించగా వారు ‘మాల్యా సాబ్ మార్చి రెండునే దేశం దాటేశారని’ సెలవిచ్చారట. పోనీ మాల్యా పేరున ఇక్కడ ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అని న్యాయమూర్తులు అడిగితే ‘ఆయన ఆస్తులు విదేశాలలోనే ఎక్కువగా ఉన్నాయి.
మనదేశంలో ఐదో వంతు ఆస్తులే ఉన్నాయి’ అని నీళ్లు నమిలారట బ్యాంకుల తరఫున న్యాయవాదులు. మరి మీరు ఏ ధైర్యంతో అప్పులిచ్చారు అని అడిగితే ‘అప్పట్లో ఆయన కింగ్‌ఫిషర్ విమానాలకి మంచి పేరుండేది. ఆ పేరుని చూసి ఇచ్చాం’ అన్నారు న్యాయవాదులు. తన పేరు చెప్పగానే బ్యాంకులు కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు మాల్యాగారు అప్పులు తీసుకోకుండా ఎలా ఉంటారు. ఆ డబ్బు ఖర్చయ్యాక వెనక్కి తిరిగి ఇచ్చేందుకు ఏముంటుంది. అందుకే చక్కగా లండనో, జెనీవానో చెక్కేసి ఉంటారని అనుమానం. మరి మాల్యాను వెనక్కి తీసుకువచ్చి, విదేశాలలో ఉన్న ఆయన ఆస్తులను అమ్మి బ్యాంకు రుణాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందా!


