విజయ్ మాల్యా ఇంట్లో గోల్డెన్‌ టాయిలెట్‌..!!

విజయ్ మాల్యా.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదులేండి.. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశాడుగా బాగానే గుర్తుంటాడు.. వేలల్లో రుణాలు తీసుకున్నవాళ్ళు అవి తీర్చడానికి చెమటోర్చుతుంటే, మాల్యా లాంటివాళ్ళు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విలాసవంతంగా బ్రతుకుతున్నారు.. బాగా డబ్బున్న వాళ్ళు బంగారు ప్లేట్, బంగారు స్పూన్ తో అన్నం తింటారని అప్పుడప్పుడు వింటుంటాం.. కానీ మాల్యా వాళ్ళకంటే ఓ పది మెట్లు ఎక్కువ కదా.. అందుకే ఈయన గారు ఏకంగా బంగారు టాయిలెట్ వాడుతున్నాడు.

 

 

రచయిత, ప్రొఫెసర్‌ జేమ్స్‌ క్రాబ్‌ట్రీ రీసెంట్ గా ముంబైలో ఓ సమావేశానికి హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాల్యా గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు.. 'లండన్‌లోని మాల్యా ఉంటున్న భవంతిలో ఆయనతో నాలుగు గంటలు గడిపే అవకాశం వచ్చింది.. నేను అక్కడికి వెళ్లినప్పుడు ఆయన ఎంతో బాధపడుతున్నట్లు కనిపించారు.. అప్పుడు ఆయన మద్యం సేవిస్తూ ఉన్నారు.. ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత మాల్యా అనుమతితో అక్కడున్న వాష్‌రూమ్‌లోకి వెళ్లాను.. అక్కడ ఉన్న గోల్డెన్‌ టాయిలెట్‌ చూసి ఆశ్చర్యపోయాను' అన్నారు.. చింతచచ్చినా పులుపు చావదు అంటే ఇదేనేమో.. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులు ఉన్న ఆయన విలాసవంతమైన జీవితానికి ఢోకా లేదు.