మాల్యానే మించిపోయాడుగా...వీళ్లు కనబడరు..

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగనామం పెట్టి కింగ్ పిషర్ అధినేత విజయ్ మల్యా ఎంచక్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరో కుంభకోణం చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీరవ్ మోడీ  11వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎంచక్కా ఆయన కూడా విదేశాలకు చెక్కేశాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీరవ్ మోడీ.. వజ్రాల వ్యాపారి. దేశంలోని అతిపెద్ద రెండో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి.. రూ.11వేల కోట్లను విదేశాలకు తరలించినట్టు వెలుగు చూసింది. దీంతో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచీలతో పాటు.. ఆ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన నీరవ్ మోడీ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీ చేశారు. 11 వేల 300 కోట్లకు పైగా డబ్బును తప్పుడు లావాదేవీలతో దారి మళ్లించినట్టు గుర్తించారు. అంతేకాదు ఇతర బ్యాంకులు కూడా నీరవ్ మోడీ …ఆయన కుటుంబ సభ్యులకు అప్పులిచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మంది దాకా బ్యాంకు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. వాళ్లనుంచి వివరాలు రాబడుతున్నారు.

 

ఇదిలా ఉండగా... ఈ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ కనిపించటం లేదు. ఆచూకీ లేదు. ఇతను కూడా విదేశాలకు పారిపోయి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. స్విట్జర్లాండ్ దేశం వెళ్లి ఉంటాడని భావిస్తున్నాయి. మొత్తానికి నీరవ్ మోడీ.. విజయ్ మాల్యానే తలదన్నాడు అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. లండన్ లో ఉన్న మాల్యానే ఇండియాకు రప్పించడానికి మనవాళ్లు నానా కష్టాలు పడుతున్నారు... ఇంక నీరవ్ మోడీ ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఆయన ఆచూకి కనిపెట్టి...ఇండియాకు రప్పించి.. ఆయనకు శిక్ష పడేవరకూ పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వాలకు మాత్రం ఇవేమీ కనిపించవు.. ఎన్నికోట్ల కుంభకోణాలు జరిగినా చాలా సింపుల్ గా వీళ్లు దోషులు కాదు తీర్పులిచ్చేస్తుంటారు. సామాన్య ప్రజలపై మాత్రం తమ ప్రతాపాలు చూపిస్తుంటారు.