TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అండగా ప్రభుత్వం : సీఎం చంద్రబాబు

Published on: Sun Jul 12, 2026 1:41PM

 

వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని, ప్రాణాలతో బయటపడిన పర్యాటకులను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లె కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదంలో మరణించిన వారి భౌతిక కాయాలను స్వదేశానికి తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఏజెన్సీని నియమించిందని తెలిపారు.

మృతదేహాల గుర్తింపు, అప్పగింత, స్వదేశానికి తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను నేడు విమానాల ద్వారా వారి స్వస్థలాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వారికి అవసరమైన విమాన టికెట్లను సంబంధిత మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. బాధితులంతా సురక్షితంగా స్వదేశానికి చేరుకునే వరకు, అలాగే మృతుల భౌతిక కాయాల తరలింపు పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని ఏపీ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియలో వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం కొనసాగిస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.