TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్రామ‌ర్‌-గ్లామ‌ర్‌!.. చంద్ర‌బాబు నాటిన మొక్క‌.. జ‌గ‌న్ కేబినెట్‌లో మినిస్టర్..

Published on: Mon Apr 11, 2022 3:45PM

విడదల రజినీ జాక్‌పాట్ కొట్టేశారు. జగన్ కేబినెట్‌లో బర్త్ సంపాదించారు. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అండ్‌ యంగెస్ట్ ఎమ్మెల్యే అయినా కూడా.. ఏరికోరి మ‌రీ మంత్రి ప‌ద‌వి వ‌రించింది. జ‌గ‌న్ భ‌జ‌న చేయ‌డం.. సోష‌ల్ మీడియాలో బాగా ప్ర‌మోట్ చేసుకోవ‌డం.. ఆమెకు బాగా క‌లిసొచ్చింది. నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రూపంలో హార్డిల్ ఉన్నా.. చాక‌చ‌క్యంగా దాటేసి.. కేబినెట్‌లోకి జంప్ చేశార‌ని.. ర‌జిని గురించి చిలుక‌లూరిపేట‌లో చ‌ర్చించుకుంటున్నారు.

హైద‌రాబాద్‌లో పుట్టి, పెరిగి, చ‌దివి.. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసొచ్చి.. టీడీపీలో రాజ‌కీయ అరంగేట్రం చేశారు విడద‌ల ర‌జిని. సైబ‌రాబాద్‌లో చంద్ర‌బాబు నాటిన మొక్క‌ను తానంటూ.. ఒకే ఒక్క డైలాగ్‌తో తెగ పాపుల‌ర్ అయిపోయారు. ఆ త‌ర్వాత ఆ చంద్ర‌బాబుకే హ్యాండిచ్చి.. సైకిల్ దిగి వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. 29 ఏళ్ల‌కే చిలుక‌లూరిపేట నుంచి పోటీ చేసి.. త‌న రాజ‌కీయ గురువు ప‌త్తిపాటి పుల్లారావుపైనే గెలిచి.. సంచ‌ల‌నం సృష్టించారు ర‌జిని. 

ఆమె గెలుపున‌కు ధ‌న‌బ‌లంతో పాటు సోష‌ల్ మీడియా బ‌ల‌గమే కీల‌కం అంటారు. బాగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి.. డిజిట‌ల్ మీడియాలో తెగ పబ్లిసిటీ చేయించుకుంటార‌ని అంటుంటారు. సొంతంగా ఓ సోష‌ల్ మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసుకుని.. ఇప్ప‌టికీ నెల‌కు ల‌క్ష‌లాది రూపాయ‌లు డిజిట‌ల్ ప్ర‌మోష‌న్ కోసం కేటాయిస్తుంటారు. గ‌త‌ మూడేళ్లలో సోష‌ల్ మీడియా ప్ర‌చారం కోస‌మే ఏకంగా 3 కోట్లు ఖర్చు చేశార‌ని ఆమె అనుచ‌రులు చెబుతున్నారు. అలా ఖ‌ర్చు చేసిన డ‌బ్బేమీ వృధాగా పోలేదని.. మంత్రి ప‌ద‌వి రూపంలో జాక్‌పాట్ కొట్టేశారని అంటున్నారు.

మైక్ దొరికితే చాలు.. విడదల రజినీ కాస్తా.. చిడతల రజినీ అయిపోతుంటారంటూ స్వ‌ప‌క్షం, ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తుంటుంది. స్వ‌త‌హాగా పొగ‌డ్త‌లంటే మ‌హా ప్రీతి ఉండే జ‌గ‌న‌న్న‌.. విడ‌ద‌ల వారి భ‌జ‌న‌కు తెగ ఫిదా అవుతుంటారు. ముసిముసి న‌వ్వుల‌తో మురిసిపోతుంటారు. ఇంగ్లీష్ వింగ్లీష్ ఈక్వేష‌న్ ఉండ‌నే ఉంది. అలా, త‌న మాట‌ల‌తో అధినేత‌ను బుట్ట‌లో వేసుకొని.. మంత్రి ప‌ద‌వి ప‌ట్టేశార‌ని చెబుతున్నారు. ఇక‌, త‌న పొలిటిక‌ల్‌ గ్రామ‌ర్‌తో మినిస్ట‌ర్ పోస్టుకి మ‌రింత గ్లామ‌ర్ తీసుకొస్తార‌ని ఆమె అభిమానులు అంటున్నారు.