TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ మంత్రిగా 'తెలంగాణ బిడ్డ'.. ర‌జినీ స్వ‌గ్రామంలో సంబ‌రం..

Published on: Wed Apr 13, 2022 11:24AM

విడ‌ద‌ల ర‌జినీ. ఈమె తెలీని వారు ఉండ‌క‌పోవ‌చ్చు. సోష‌ల్ మీడియాలో ఫుల్ పాపుల‌ర్‌. ఫుల్‌గా ప్ర‌మోట్ చేసుకోవ‌డంతో ర‌జినీకి మీడియాలో చాలా క్రేజ్. సైబ‌రాబాద్‌లో చంద్ర‌బాబు నాటిన మొక్క‌ను తానంటూ రాజ‌కీయ అరంగేట్రం చేసి.. ఆ త‌ర్వాత వైసీపీలో చేరి.. చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి.. మూడేళ్లుగా ప్ర‌జాప్ర‌తినిధిగా మెరిశారు. త‌న వాక్ చాతుర్యంతో, జ‌గ‌న‌న్న భ‌జ‌న‌తో.. చిడ‌త‌ల ర‌జినీగానూ ప్రచారం పొందారు. క‌ట్ చేస్తే.. మొద‌టిసారి ఎమ్మెల్యే మాత్ర‌మే అయిన ఆమెకు అనూహ్యంగా మంత్రి ప‌ద‌వి వ‌రించింది. ర‌జినీ స్కెచ్ బాగానే వ‌ర్క‌వుట్ అయింది అంటున్నారు. 

విడ‌ద‌ల ర‌జినీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌, ఫారెన్ రిట‌ర్న్ అని అంద‌రికీ తెలిసినా.. ఆమె తెలంగాణ బిడ్డ అని కొంద‌రికే ఎరుక‌. ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజని తెలంగాణ బిడ్డే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం ఆమె స్వ‌గ్రామం.

కొండాపురంకు చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని. సత్తయ్య బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు రజనికి.. ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తతో వివాహమైంది. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య మంత్రిగా ఎదిగారు. ఈ విష‌యం తెలిసి యాదాద్రి జిల్లా కొండాపురం గ్రామంలో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌మ ఊరి బిడ్డ‌.. ఏపీలో మంత్రి అయిందంటూ స్థానికులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.