శ్రీమతికి ప్రేమతో...

తెలుగు భాషాభిమాని వెంకయ్య నాయుడు. తన శ్రీమతి ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అచ్చ తెలుగులో లేఖ రాశారు ఉపరాష్ట్రపతి. ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా.. తన ప్రేమాభిమానాలన్నీ ఏర్చి కూర్చి.. లేఖతో అక్షరమాల రచించారు. శ్రీమతి ఉషను కొనియాడుతూ వెంకయ్య రాసిన లేఖ.. నిజంగా అద్భుతం. ఆ లేఖ తెలుగు వన్ పాఠకుల కోసం..

 

న్యూఢిల్లీ,
1 మార్చి 2021.

అర్ధాంగి లక్ష్మీ ఉషమ్మకు,

నీ 66 ఏళ్ళ జీవితంలో, నేటికి ఐదుపదులకు మించిన జీవితాన్ని నా కోసం, మన కుటుంబం కోసం వెచ్చించిన నీ ప్రేమ, సహనం, ఆదరం, ఆప్యాయత, అవ్యాజానురాగం అనిర్వచనీయమైనవి. 

జన్మదినమిదమ్ అయి ‘ప్రియసఖీ’ శం తనోతు తే సర్వదా ముదమ్ ।। 
ప్రార్థయామహే భవ శతాయుషీ ఈశ్వరః సదా త్వాం చ రక్షతు ।।
పుణ్య కర్మణా కీర్తిమర్జయ జీవనం తవ భవతు సార్థకమ్ ।।

ఓ ప్రియసఖీ, నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీకు ఎల్లప్పుడూ శుభమగుగాక. భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆయన నిన్ను ఎల్లప్పుడూ రక్షించు గాక, పుణ్యకర్మలాచరించి, కీర్తిని సంపాదించి, జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవలెనని ఆకాంక్షిస్తున్నాను.

స్నేహ బాంధవీ..

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి!  మన పెళ్ళి నాడు ఈ ప్రమాణం చేశాము. ఐదు పదుల మన వివాహ బంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అడుగడుగునా నీవు పాటించి, నా చేత పాటింపజేసిన ప్రతి అంశాన్ని ఈ శ్లోకం గుర్తుకు తెస్తుంది.

మన వివాహం నాటికి ముందు నుంచే, నా జీవితం ప్రజలతో పెనవేసుకుపోయింది. ఆ తర్వాత ప్రజలనే తప్ప, కుటుంబాన్ని పట్టించుకున్నది చాలా తక్కువని నీకు బాగా తెలుసు. 

అయినప్పటికీ పిల్లలను ప్రయోజకులను చేయడమే గాక, వారి పిల్లల బాధ్యతను కూడా తీసుకుని, భారతీయ కుటుంబ వ్యవస్థకు చిరునామాగా మన కుటుంబాన్ని తీర్చిదిద్దిన తీరు ఉన్నతమైనది. నీదైన, మనదైన ప్రపంచంలో మన పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికీ చోటునిచ్చిన ఆప్యాయతానురాగాలను పంచిన తీరు అపురూపం.

చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన నాకు, అంతటి అనురాగాన్ని అందించిన అర్ధాంగికి, మనదైన కుటుంబాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన గృహలక్ష్మికి, నా జీవితానికి చేదోడుగా నిలిచిన సహధర్మచారిణికి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”

ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. నాతో కలిసి ఏడడుగులు నడిచిన నీవు, నా తోడు నీడగా ఏడేడు జన్మలూ నడవాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రేమాభినందనలతో...