ఉపరాష్ట్రపతి ఎందుకు సెల్యూట్ చేయలేదు?
Published on: Tue Jan 27, 2015 12:37PM

సోమవారం నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతీయ జండాను ఎగురవేసిన అనంతరం అందరూ జాతీయ గీతాన్ని పాడే సమయంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ సెల్యూట్ చేయకపోవడం వివాదాస్పదమైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తుండగా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాత్రం మామూలుగా నిలబడి వున్నారు. ఈ ఫొటో సోమవారం నాడు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. విమర్శలూ వెల్లువెత్తాయి. దీనిమీద ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రొటోకాల్ ప్రకారం జాతీయ గీతాలాపన సమయంలో ఉప రాష్ట్రపతి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కార్యక్రమంలో ప్రధాన హోదాలో ఉన్నవారు, యూనీఫామ్‌లో ఉన్నవారు ఈ సమయంలో సెల్యూట్ చేయాలి. సాధారణ దుస్తుల్లో వున్నవారు సావధానంలో నిలబడితే చాలు. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో ఉన్న రాష్ట్రపతి సెల్యూట్ చేశారు. ఉపరాష్ట్రపతి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హమీద్ అన్సారీకి దేశం ఇంత ఇచ్చింది. జాతీయ పతాకానికి సెల్యూట్ చేయొచ్చు కదా. ఈ విషయంలో కూడా ప్రొటోకాల్ అని వివరణలు ఇచ్చుకోవడం ఎందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి.


