వీహెచ్‌తో సీపీ ఆనంద్ కామెడీ ట్రాక్.. స్మైల్ ప్లీజ్...
Published on: Tue Feb 22, 2022 2:22PM
వి.హనుమంతరావు. కాంగ్రెస్‌లోకే సీనియర్ నేత. ఆయన మాట, యాస అదో టైప్ ఉంటుంది. పక్కా హైదరాబాదీ ఇస్టైల్. పెద్దాయన ఎప్పుడు గుస్సా అవుతారో.. ఎప్పుడు నవ్వుతారో ఓ పట్టాన అర్థం కాదు. కాంగ్రెస్‌లో నిత్య అసంతృప్తవాది అంటారు. నాటి వైఎస్సార్ నుంచి.. నేటి రేవంత్‌రెడ్డి వరకూ.. ఆయన అందరితో కలిసినట్టే ఉంటూ.. కలవకుండా ఉంటారు. దటీజ్ వీహెచ్.
లేటెస్ట్‌గా హన్మంతన్నకు మళ్లీ గుస్సా వచ్చింది. తన ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేస్తున్నారని.. మెడలో గులాబీ కండువా కప్పుకున్నట్టు.. కేసీఆర్‌తో కలిసినట్టు.. ఫోటోలు క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో తనను బద్నామ్ చేస్తున్నారంటూ గుర్రుగా ఉన్నారు. తాజా జగ్గారెడ్డి ఎపిసోడ్‌తో తాను కూడా బాధితుడినేనంటూ.. ముందుకొచ్చారు. ఎలాగూ వచ్చాం కదా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలా.. అని ఆ పనీ చేశారు.
రెండు రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు వీహెచ్. ఎప్పటిలానే అక్కడ పోలీస్ అధికారితో వాదనకు దిగారు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక లాభం లేదనుకుని.. ఈసారి నేరుగా హైదరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అది మరింత కామెడీ క్రియేట్ చేసింది.
వీహెచ్.. హైదరాబాద్ సీసీఎస్ కు వెళ్లిన సమయంలోనే అక్కడకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వచ్చారు. ఆ ఇద్దరూ పరస్పరం విష్ చేసుకున్నారు. "ఎవరి మీద కంప్లైంట్ చేయటానికి వచ్చారు? నా పైనా.. నేనేమైనా చేశానా? లేదంటే మా వాళ్లు ఏమైనా చేశారా?" అంటూ కాస్త జోవియల్‌గా మాట్లాడారు సీపీ ఆనంద్.
"ఎవరో గిట్టనివారు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో చేరినట్టు.. కండువా వేసుకుంటున్నట్టు.. ఫోటోను మార్ఫింగ్ చేశారు" అని సీపీకి చెప్పారు వీహెచ్. "మార్ఫింగ్ కేసా.. దీన్ని సీరియస్‌గా తీసుకుంటాం". అన్నారు సీపీ.
ఆ సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. ఆ సంభాషణను మరికాస్త జోవియల్‌గా మార్చేశారు. "ఇంతకీ వారు రాసిన వ్యాఖ్యల్లో ఏమైనా నిజముందా? మీ మనసులో అలాంటి ఆలోచన ఉందా?" అంటూ వీహెచ్‌ను ప్రశ్నించారు. "మా పార్టీలోనే డేంజర్ ఉంది. మాలోనే ప్రతిపక్షం ఉంది" అని పెద్దాయన జవాబిచ్చారు. "అది అందరికీ తెలిసిందే కదా. మీకు మరో ప్రతిపక్షమే అక్కర్లేదు" అంటూ సీపీ మరో కామెంట్ వదిలారు. అది విని అక్కడి వారంతా పెద్ద ఎత్తున నవ్వారు. హాట్ హాట్‌గా వచ్చిన హన్మంతన్నను.. సీపీ ఆనంద్ అలా కూల్ కూల్‌గా మార్చడం ఆసక్తికరంగా మారింది.


