చంద్రబాబు జగన్ తో కుమ్మక్కు: హనుమంతరావు ఉవాచ

 

సీనియర్ కాంగ్రెస్ నేత వీ.హనుమంత రావు మాటలు విన్నవారికి ఉద్యోగులకే కాదు రాజకీయ నాయకులకి సైతం పదవీ విరమణ వయసు పెట్టడం అవసరమనిపిస్తుంది.

 

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి అక్రమంగా వేలకోట్ల ఆస్తులు కూడ బెట్టుకొన్నాడు. ఆయన తండ్రి తెలంగాణా ఏర్పాటు చేయాలని కోరితే అతను మాత్రం సమైక్యవాదం పేరిట దేశాటన చేస్తూ ప్రతిపక్ష నేతలందరినీ కలుస్తున్నాడు. ఈ మిషతో అందరినీ కలుస్తూ పరిచయాలు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అసలు ఉద్దేశ్యం వేరే ఉంది. పార్టీలనన్నిటినీ పోగేసి కేంద్రంలో ఏదో చక్రం తిప్పేయాలని కలగంటున్నాడు. అయితే అది నెరవేరదని అతనికీ తెలుసు. అతను హైదరాబాదు బయట కాలుపెడితే సాక్షులను ప్రభావితం చేస్తాడని వాదించిన సీబీఐ ఇప్పుడు అతనిని దేశమంతా తిరగడానికి, ఎవరిని పడితే వారిని కలవడానికి ఎందుకు అనుమతి ఇస్తోందో అర్ధం కావడం లేదు. ఇప్పటికయినా సీబీఐ కోర్టులు అతనికి కళ్ళెం వేయాలి,” అని అన్నారు.

 

ఆయన ఇంతటితో ఆగితే పరువలేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులు అనుమతులు మంజూరు చేయకుండా చంద్రబాబు అడ్డుకోవాలని ఒక విచిత్రమయిన కోరిక కోరారు. ఇంతవరకు ఆ రెండు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యాయని ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకొంటుంటే, ఇప్పుడు హనుమంత రావు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యాడని, అందుకే అతనిని అడ్డుకోవడం లేదని విచిత్రమయిన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయి తమను అన్యాయం చేస్తోందని లగడపాటి వంటి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వాపోతుంటే ఈయన ఈవిధంగా మాట్లాడటం చూస్తే ఇక రాజకీయాల నుండి రిటైర్మెంటు తీసుకోవచ్చునని అర్ధం అవుతోంది.