రాళ్లపల్లి ఇకలేరు.. 800 పైగా సినిమాలు, 8వేలకు పైగా నాటకాలు

 

ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించిన రాళ్లపల్లి.. 1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. శుభలేఖ, ఖైదీ, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, ఏప్రిల్‌ 1 విడుదల, సుందరకాండ, భలే భలే మగాడివోయ్‌ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. రాళ్లపల్లికి చిల్లరదేవుళ్లు, చలిచీమలు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు.

తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన రాళ్లపల్లి.. సినీ ప్రస్థానంలో తన విలక్షణమైన నటనతో ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలోని ‘బొంబాయి’ చిత్రంలో హిజ్రాగా నటించి ఔరా అన్పించారు. రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. దాదాపు 8వేలకు పైగా  నాటకాల్లో నటించిన ఆయన చాలా భాగం నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. కేవలం హాస్య నటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాళ్లపల్లి మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.