వేణుస్వామికి హైకోర్టులో ఊరట
Published on: Thu Aug 29, 2024 11:18AM
సెలబ్రిటీలపై జోస్యాలు చెప్పి పాపులర్ అయిన వేణుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగిన కొద్ది గంటల్లోనే వారు విడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పి వివాదానికి కారణమయ్యారు. వేణుస్వామి విడుదల చేసిన ఈ వీడియో దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వేణుస్వామి పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా సినీరంగంలో అక్కినేని వారసత్వం కొనసాగుతోంది. ఈ కుటుంబం పాపులారిటీ దెబ్బతీసే జోస్యాన్ని జర్నలిస్ట్ సమాజం కూడా గర్హించింది. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ సామాజిక బాధ్యతతో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశాయి. దీంతో మహిళా కమిషన్ కూడా వేణుస్వామికి నోటీసులు అందజేసింది. ఈ నోటీసులు అందుకున్న వేణుస్వామి మహిళా కమిషన్ కార్యాలయానికి గైర్హాజరయ్యారు. పైగా తన న్యాయ పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టునాశ్రయించారు. వేణుస్వామి పిటిషన్ హైకోర్టులో అడ్మిట్ అయ్యింది. నాగ చైతన్య, శోభితకు లేని అభ్యంతరం మీకెందుకు అని ఫిలింజర్నలిస్ట్ అసోసియేషన్ ను హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు వేణుస్వామికి ఊరట లభించింది. మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులకు ఎలాంటి చట్టబద్దత లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.


