TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి ఆలయంపై విమానాలను కేంద్రం ఆపలేదట....

Published on: Wed Jul 20, 2016 4:40PM

Tirupathi

తిరుమల కొండపై విమానాలు ఎగరకుండా నిషేదించడం వీలు కాదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధర్మిక క్షేత్రం, కోట్లాది మంది భక్తుల ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదో ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు కానీ అదే పనిగా విమానాలు ఎగురుతుండటంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూలోక వైకుంఠం, కలియుగదైవం కొలువైన ఆనంద నిలయం..వేంకటాచలపతి సంస్థానం తిరుమల. స్వామి వారు కొలువైన శేషాచల పర్వత శ్రేణులను నిశితంగా పరిశీలిస్తే..శ్రీవారి ముఖం కనిపిస్తుంది.

 

అందుకే ఏడు కొండలనూ వేంకటేశుడి ప్రతిరూపంగానే విశ్వసిస్తారు భక్తులు. సాధారణ భక్తులతో పాటు నిత్యం ముక్కోటి దేవతలు, సప్తర్షులు కూడా శ్రీవారిని సేవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి తిరుమల గిరులను పాదాలతో అధిరోహించినట్లుగా అనిపించేలా..విమానాల రాకపోకలు జరగడం శాస్త్ర విరుద్ధమని ఆగమ పండితులు వాదిస్తున్నారు. దానికి తోడు ఏ క్షణానైనా విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు మాటు వేసి ఉన్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా నో ఫ్లైయింగ్ జోన్ లిస్ట్‌లో శ్రీవారి ఆలయాన్ని చేర్చారు. కానీ రాను రాను ఈ నిబంధన గాలికిపోయి..విమానాలు యధేచ్చగా రాకపోకలు సాగిస్తున్నాయి.

 

ఈ పరిస్థితుల్లో తిరుమల కొండలపై విమానాలు తిరగకుండా నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పౌర విమానయాన శాఖను కోరింది. దీనిపై ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో వివరణ ఇచ్చారు. తిరుమల కొండపై విమానాలు ఎగరకుండా నిషేధించలేమని అలా చేస్తే ఇప్పటికే పలు విమానాలకు అందుబాటులో లేకుండా పోయిన తిరుపతి విమానాశ్రయానికి రాకపోకలు మరింత తగ్గే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒక సమయంలో, ఒక్క విమానం మాత్రమే వచ్చిపోయే విధంగా తిరుపతి విమానాశ్రయం ఉందన్నారు. అది వెళ్లే వరకు రెండో విమానం ఆ రన్‌వేపై దిగడానికి అవకాశం లేదన్నారు.