TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కువైట్ జైల్లో కడప వాసి సూసైడ్.. త్రిపుల్‌ మ‌ర్డ‌ర్‌ కేసులో క‌ల‌క‌లం..

Published on: Thu Mar 17, 2022 12:36PM

దేశం గాని దేశం వెళ్లాడు. పొట్ట‌కూటి కోసం ఎడారి దేశం కువైట్‌లో ప‌నికి కుదిరాడు. ఓ షేక్ ఇంట్లో కారు డ్రైవ‌ర్‌గా చేరాడు. అక్క‌డ అంతా బాగుండ‌టంతో త‌న భార్య స్వాతిని కూడా కువైట్ తీసుకెళ్లాడు వెంక‌టేశ్‌. ఆల్ హ్యాపీస్ అనుకుంటుండ‌గానే.. ఒక్క‌సారిగా క‌ల‌క‌లం. వెంక‌టేశ్ ప‌ని చేస్తున్న ఓన‌ర్ ఇంట్లో ట్రిపుల్ మ‌ర్డ‌ర్‌. ఎవ‌రు చంపారో తెలీదు. ఎందుకు చంపారో తెలీదు. కానీ, చంపింది వెంక‌టేశే అని అరెస్ట్ చేశారు కువైట్ పోలీసులు. జైల్లో పెట్టారు. అత‌ని భార్య‌ను బ‌ల‌వంతంగా కువైట్ నుంచి పంపించేశారు. క‌ట్ చేస్తే.. అర్థ‌రాత్రి జైల్లో వెంక‌టేశ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దేశం కాని దేశంలో.. క‌డ‌ప జిల్లా వాసి ఇలా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పాల‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వెంకటేష్ మ‌ర‌ణంతో ఆయ‌న స్వ‌గ్రామం కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నేపాడులో తీవ్ర విషాదం నెల‌కొంది.

కువైత్‌లో ముగ్గురు కుటుంబ సభ్యుల హత్య ఆరోపణలపై అరెస్టైన తెలుగు వ్యక్తి పిల్లోల వెంకటేష్(35) బలవన్మరణానికి పాల్పడ్డాడు. జైలు గదిలోనే ఉరివేసుకొని చనిపోయినట్లు జైలు అధికారులు వెల్లడించారు. వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని కడపలోని కుటుంబ సభ్యులకు అక్కడి అధికారుల ద్వారా సమాచారం అందింది. 

మూడేళ్ల క్రితం ఉపాధి కోసం కువైత్ వెళ్లాడు వెంక‌టేశ్‌. మార్చి 4న వెంకటేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కుటుంబానికి చెందిన ముగ్గురు వారి ఇంట్లోనే అనుమానస్పదస్థితిలో మృతిచెందారు. కత్తితో దారుణంగా పొడిచి చంపారు. నాలుగు రోజుల త‌ర్వాత విష‌యం వెలుగుచూసింది. కేసు న‌మోదు చేసిన కువైట్‌ పోలీసులు, డిటెక్టివ్స్.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ నెల 6న కారు డ్రైవర్ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ ముగ్గురిని తానే హత్య చేసినట్లు వెంకటేష్ అంగీకరించినట్లు కువైట్‌ పోలీసులు వెల్లడించారు. యజమానితో ఆర్థిక వివాదం కారణంగానే వారిని చంపినట్టు ఒప్పుకున్నాడని తెలిపారు. 

అయితే, ఆ హత్యలతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని వెంకటేష్ భార్య స్వాతి ఖండిస్తూ వ‌స్తోంది. త‌న భ‌ర్త వెంక‌టేశ్‌పై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించింది. మృతులకు వారి బంధువులతో గొడవలు ఉన్నాయని, వారే ఈ హత్యలు చేసి.. వెంకటేష్‌ను ఇరికించి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. పొట్టకూటి కోసం దేశం కాని దేశానికి వెళ్లిన తాము.. అంత పెద్ద వారిని ఎందుకు హత్య చేస్తామని చెబుతోంది. కువైట్ జైలు నుంచి తన భర్తను విడిపించాలంటూ ఇటీవల కడప కలెక్టర్‌ని క‌లిసి వేడుకుంది. జిల్లా అధికారులు ఏం చేయ‌లేక‌పోయారు. ఇంత‌లోనే కువైట్ జైల్లో వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆ దేశం అధికారుల నుంచి స‌మ‌చారం రావ‌డంతో.. స్వాతి క‌న్నీరు మున్నీర‌వుతోంది. వెంక‌టేశ్ ఆఖ‌రి చూపు అయినా ద‌క్కుతుందో లేదోన‌ని త‌ల్ల‌డిల్లుతోంది. 

వెంక‌టేశ్ ఆక‌లి పోరాటం ఇలా విషాదాంతం అవ‌డం అంద‌రినీ క‌లిచివేస్తోంది. క‌డ‌ప‌లోనో, ఏపీలోనో.. ఉపాధి అవ‌కాశాలు ఉండిఉంటే.. దేశం కాని దేశానికి ఎందుకు వ‌ల‌స వెళ్లి ఉండేవారని.. ఇలా ఎందుకు ప్రాణాలు వ‌దిలేవార‌ని అంటున్నారు.