రక్షణమంత్రిగా దుర్గామాత..ఆర్ధికమంత్రిగా లక్ష్మీదేవి

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంచి వక్త అని అందరికి తెలిసిందే..ప్రాసలు, అంత్య ప్రాసలు, ఛలోక్తులు, పొడుపు కథలతో ఆయన చేసే ఉపన్యాసానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. తాజాగా తన వాక్చాతుర్యాన్ని..పురాణాలపై తనకున్న పట్టును మరోసారి చూపించారు వెంకయ్య.

 

మొహాలీలోని ఇండియన్ బిజినెస్ స్కూల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహిళా సాధికారికత గురించి మాట్లాడారు ఉప రాష్ట్రపతి. మనదేశంలో ప్రాచీనకాలం నుంచి మహిళలను గౌరవిస్తూ వస్తున్నామని..దేశంలోని నదులన్నీ స్త్రీ పేర్లతో కూడినవేనని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గంగా, యమున, కావేరి, నర్మద, మహానది, తపతి తదితర నదులు ఇందుకు ఉదాహరణ అని అన్నారు. చివరకు దేశాన్ని కూడా భరతమాత అని పిలుస్తామని..లేదంటే మదర్ ఇండియా అని అంటామని వివరించారు. ఇక పురాణాల ప్రాతిపదికన చూస్తే..సరస్వతీ దేవి విద్యాశాఖా మంత్రిగా, దుర్గామాత రక్షణ మంత్రిగా, లక్ష్మీదేవి ఆర్థిక మంత్రిగా ఉన్నారంటూ ఆయన చెప్పగానే ఆడిటోరియం కేరింతలతో మార్మోగిపోయింది.