ఉన్న ఆ ఒక్క దిక్కుని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్..!

తెలుగు రాష్ట్రాలకి ఢిల్లీ పెద్దలు ఎప్పుడూ మొండి చేయి చూపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ హయాంలో అసలు మనకి పెద్దగా ఒరగబెట్టిందేం లేదనే చెప్పొచ్చు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రి పదవి చేబట్టిన వెంకయ్య నాయుడు పుణ్యమా అని ఆంధ్ర ప్రదేశ్ కి చాలా విషయాల్లో మంచి జరిగింది. స్పెషల్ ప్యాకేజ్ రావడం అవొచ్చు, కాపిటల్ సిటీ నిర్మాణంలో తోడ్పాటు అవొచ్చు, కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి తెప్పించే ప్రయత్నాలు అవొచ్చు, ఏది ఏమైనా మన పెద్దాయన ఢిల్లీ లో ఉన్నాడు అనే భరోసా ఉండేది తెలుగు వారికి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సంబంధాలు మెరుగుపడడంలో వెంకయ్య నాయుడిది కీలక పాత్ర. ఒక మాటలో చెప్పాలి అంటే ఆంధ్ర రాష్ట్ర బాగోగుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వారధిగా పనిచేసారు నాయుడు గారు.

 

అలాంటి, మన పెద్ద తన పదవిని త్యజించి ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఎవరూ ఊహించని విధంగా, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే వెంకయ్య నాయుడి పేరు ప్రతిపాదించింది. మంచి, చెడులు బేరీజు వేసిన నాయుడు గారు కాబినెట్ పదవి కన్నా, ఉప రాష్ట్రపతి పదవే మిన్న అని తీర్మానించుకుని తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. అలాగే, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేసారు. ఇది మన తెలుగు వాడికి దక్కిన గౌరవంగా భావించాలా లేక మన దురదృష్టం గా భావించాలో అర్ధం కానీ సందిగ్ధ పరిస్థితి. ఎందుకంటే, మన గోడు దేశ రాజధానిలో వినే నాథుడు మరొకరు లేరు.

 

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వెంకయ్య నాయుడు బీజీపీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ ని అంటబెట్టుకుని ముందుండి నడిపించాడు. ఎవరూ ధైర్యం చేయని సమయంలో నేనున్నానంటూ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు కూడా నిర్వహించారు. ఉత్తరాదిలో ఎన్ని రాజకీయాలు చేసినా, దక్షిణాదిని, ప్రముఖంగా ఆంధ్ర ప్రదేశ్ కి ఎప్పుడూ తన సహాయ సహకారాలు అందించారు. అలాంటి పెద్దాయన సేవలు ఇక మనం కోల్పోతున్నామా అంటే అవుననే చెప్పవచ్చు. అలాగని, తెలుగు వారి బాగోగుల గురించి మొత్తంగా మరచిపోతాడని కాదు, కానీ ఇంతకు ముందులా అన్ని విషయాల్లో పట్టించుకునే సమయం వారికి ఉండకపోవచ్చు.

 

ఇంకా ఎన్నికలు జరగనప్పటికీ, ప్రత్యర్థిగా గాంధీ వారసుడు గోపాల కృష్ణ గాంధీ ఉన్నప్పటికీ, ఎన్డీయే కి ఉన్న బలం దృష్ట్యా, వెంకయ్య ఉప రాష్ట్రపతి కావడం నల్లేరు మీద నడకలాంటిదే. ఆయన పదవి చేపట్టిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేనప్పటికీ, తన వాళ్ళ కోసం, ఢిల్లీ పెద్దల్ని మెప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తారని ఆశిద్దాం!