చైర్మన్‌గా తొలి రోజు.. సభను వెంకయ్య ఎలా నడిపించారంటే..?

 

నిన్న మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా.. కేంద్రమంత్రిగా ఎలాంటి హోదాలో పని చేసినా తన మార్క్ వేస్తూ వచ్చారు వెంకయ్య నాయుడు. అలాంటి వ్యక్తి ఉప రాష్ట్రపతిగా.. రాజ్యసభ చైర్మన్‌గా సభను ఎలా నడిపిస్తారో అనుకున్న వారందరికీ.. తొలి రోజే డౌట్ క్లారిఫై చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిసారిగా చైర్మన్ హోదాలో సభకు వచ్చిన ఆయనకు సభ్యులు నిలబడి అభివాదం చేశారు. ఈ సందర్బంగా ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఇప్పటి వరకు రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు "ఐ బెగ్ టు" అనే పదంతో ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసేవారని.. అయితే ఈ వాక్యాన్ని మనకు స్వతంత్ర్యం రాకముందు వాడేవారని.. అది వలసవాదానికి నిదర్శనమని.. ప్రస్తుతం మనం స్వతంత్ర్య భారతంలో జీవిస్తున్నందున ఆ పదాన్ని వాడాల్సిన అవసరం లేదన్నారు. దానికి బదులుగా "ఐ రెయిజ్ టు లే ఆన్‌ ది టేబుల్" అనే వాక్యాన్ని ఉపయోగించాలని వెంకయ్య నాయుడు సూచించారు. నాది ఒక సలహా మాత్రమేనని.. ఆదేశం కాదని అన్నారు. అంతేకాకుండా, మృతి చెందిన సభ్యులకు సంతాప తీర్మానాన్ని ప్రకటించే సమయంలో.. ఛైర్మన్లు ఎక్కడా నిల్చున్న దాఖలాలు లేవు.. కానీ అందుకు విరుద్ధంగా వెంకయ్య నాయుడు నిల్చోవడం గమనార్హం.