రాజ్యసభలో తన మార్క్ చూపించిన వెంకయ్య...

 

వెంకయ్యనాయుడు మరోసారి తన మార్కును చూపించారు. నాడు కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తన దైన పనితీరును కనపరచిన వెంకయ్యనాయుడు... ఉపరాష్ట్రపతి గానూ వెంకయ్యనాయుడు తన దైన ‘మార్క్’ వేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో రాజ్యసభలో చైర్మన్ గా వెంకయ్యనాయుడు రాగానే సభ్యులందరూ అభివాదం చేశారు. అనంతరం, వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఓ సలహా చేస్తున్నట్టు చెప్పారు. ఇంతకీ, ఆ సూచన ఏంటంటే.. సాధారణంగా చట్టసభల్లో సభ్యులు పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు తమ చేతుల్లో ఉన్న పత్రాలను టేబుల్ పై పెడుతూ ‘ఐ బెగ్ యూ’ అనే పదంతో రాజ్యసభ చైర్మన్ కు విజ్ఞప్తి చేస్తారు. అయితే, ఈ వాక్యాన్ని మనకు స్వాతంత్ర్యం రాక మునుపు వాడేవారని, ఇప్పుడు.. మనది స్వతంత్ర భారతదేశం కనుక ఆ అవసరం లేదని, ఇకపై, ‘ఐ రెయిజ్ టు లే ఆన్ ది టేబుల్’ అని వాక్యాన్ని ఉపయోగించాలని వెంకయ్యనాయుడు సూచించారు. అయితే, ఇది తన సలహా మాత్రమేనని, ఆదేశం కాదని ఆయన అన్నారు.