వెంకయ్య నాయుడి గురించి పలువురి మాటల్లో..

 

ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే  వెంకయ్యనాయుడు రాజ్యసభ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడిన మోడీ.. వెంకయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను పొగొడ్తలతో ముంచెత్తారు. ముందుగా వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు చెబుతూ... దేశంలోని వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు ఒకరని అన్నారు. రైతు బిడ్డగా ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, పార్టీ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా ఎన్నో బాధ్యతలు చేపట్టి, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇదే సభలో పెరిగిపెద్దవాడైన వెంకయ్యనాయుడు ఇదే సభకు నాయకుడిగా రావడం ఆనందకరమని.. వెంకయ్యనాయుడు ఏం మాట్లాడినా బాగుంటుందని ..అదే వెంకయ్యనాయుడు తెలుగులో మాట్లాడుతుంటే మాత్రం అనర్గళంగా మాటల మంత్రమేసినట్టు ఉంటుందని అన్నారు. అప్పుడు ఆ మాటల వేగం చూసి మజా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా ఎవరెవరూ ఎం చెప్పారంటే..

 

సీతారాం ఏచూరి

 

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడుతో నాది 40 ఏళ్ల  సహజీవనం అని అన్నారు. ముందు ఇంగ్లీష్ లో మాటలు ప్రారంభించగా...తెలుగులో మాట్లాడండి అని వెంకయ్యనాయుడు అనగానే నవ్వేసి...ఆప్షన్ ఉందా? అని అడిగారు. తరువాత కొనసాగిస్తూ, 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సిద్ధంత పరంగా పోరాడాం, విభేదించాం, కలిసి పనిచేశాం, అనుభవాలు, అభిప్రాయాలు, ఆప్యాయతలు పంచుకున్నామని అన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమ ఇద్దరినీ చూసి మీడియా ఒకసారి సభలో అంత తీవ్రంగా వ్యతిరేకిస్తారు కదా... బయట ఇలా ఎలా ఉండగలుగుతున్నారని ఒక సందర్భంలో అడిగిందని.. దానికి అప్పుడు వెంకయ్యనాయుడు వారికి సమాధానమిస్తూ, నేను ఒక రైలు ఎక్కాను. రైలులో ప్రవేశించిన తరువాత సీతారాం ఏచూరి కనిపించాడు. వెంటనే రైలు దిగెయ్యాలా? అని ఎదురు ప్రశ్నించారు. దీంతో అంతా నవ్వేశారు.

 

గులాం నబీ ఆజాద్..

 

గులాం నబీ ఆజాద్.. వెంకయ్యనాయుడికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి, రాజ్యసభ చైర్మన్ స్థానాన్ని అలంకరించిన వెంకయ్యనాయుడుకు ఈ సభ కొత్తదేమీ అన్నారు. ఎన్నో మార్లు పలు విషయాల్లో సభలో తన్నుకున్నామని, తిట్టుకున్నామని, అది సభ వరకూ మాత్రమే పరిమితమని, ఆపై బయటకు వెళ్లిన తరువాత ముచ్చట్లు పెట్టుకున్నామని ఆజాద్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఎంతో స్నేహశీలిగా ఉండే వెంకయ్యనాయుడి నేతృత్వంలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను సభ తీసుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు. వెంకయ్యనాయుడితో తనకు సుదీర్ఘకాల పరిచయం ఉందని తెలిపారు.

 

అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్..

 

నవనీతకృష్ణన్.. వెంకయ్యనాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెంకయ్య తమిళనాడుకు చెందిన వ్యక్తని.. "గౌరవనీయ అధ్యక్షులు గౌరవనీయ అమ్మకు ఎంతో కావాలసిన వారు" అనడంతో సభంతా నవ్వులతో నిండిపోయింది. అమ్మ బతికుంటే వెంకయ్య ఈ పదవికి రావడంపై అందరికన్నా ఎక్కువగా ఆనందించి వుండేవారని, ఆమె ఇప్పుడు స్వర్గం నుంచి ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు.