TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెలిగొండ టన్నెల్‌లో మంత్రి అర్ధరాత్రి తనిఖీలు.. దశాబ్దాల నీటి కలకు ముగింపు ఎప్పుడో..?

Published on: Fri Aug 14, 2026 7:56PM

 

కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా మంచినీరు లేక, తాగునీటిలో ఫ్లోరైడ్ రక్కసి రక్తాన్ని పిండేస్తుంటే, వ్యవసాయం సాగక ఆకలి కేకలతో అల్లాడిపోతున్న ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ఆర్తనాదాలు ఇంకా నల్లమల కొండల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతంలో కృష్ణమ్మ పరుగులను తమ పొలాల్లోకి మళ్లించుకోవాలన్న ఆశ నెరవేరక, తరాల తరబడి సాగుతున్న సుదీర్ఘ వేదనకు సజీవ సాక్ష్యం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.

ఇటీవల అర్ధరాత్రి వేళ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి వెలిగొండ టన్నెల్ గుహల్లోకి వెళ్లి నిర్వహించిన అర్ధరాత్రి తనిఖీ ఆ ప్రాంతంలో మళ్లీ చర్చను రేకెత్తించింది. నల్లమల కొండలను తొలిచి నిర్మిస్తున్న అత్యంత సంక్లిష్టమైన ఈ టన్నెల్లో వందల మీటర్ల లోతున, మోకాళ్ల లోతు గుల్ల మట్టి, ఊపిరి సలపని వేడి, ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రత్యక్ష తనిఖీలు జరిగాయి. కిలోమీటర్ల కొద్దీ సాగే ఆ చీకటి గుహల్లో అధికారులు, ఇంజినీర్లు పడుతున్న శ్రమ ఒకవైపు కనిపించినా... మరోవైపు దశాబ్దాలుగా ఎండిపోతున్న రైతు గుండెలు, ఫ్లోరైడ్ బారిన పడి వికలాంగులుగా మారుతున్న పసిపిల్లల ఆక్రందనలు మళ్లీ ముంగిట్లోకి వచ్చాయి.

వెలిగొండ ప్రాజెక్టు అనేది కేవలం సిమెంట్, ఇనుము, మట్టి కలయికతో కడుతున్న టన్నెల్ నిర్మాణం మాత్రమే కాదు... అది దాదాపు 15 లక్షల మంది ప్రజల జీవన్మరణ సమస్య. కొండల్లోంచి 43.5 టీఎంసీల కృష్ణా ప్లాడ్ వాటర్ ప్రవహించి, నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి చేరితే గానీ ఈ ప్రాంతం పచ్చబడదు. దాదాపు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్టు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, కాలయాపన, బడ్జెట్ అంచనాల పెరుగుదల వల్ల ఇన్నాళ్లూ నెమ్మదించింది.

గతంలో అరకొర పనులతో ప్రాజెక్టు పూర్తయిపోయిందంటూ నమ్మించి చేసిన ప్రారంభోత్సవాలు తమ గాయాలపై కారం చల్లడమేనని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్ నిర్మాణం పూర్తికాకుండా, టన్నెల్ బోరింగ్ మిషన్ల (TBM) తొలగింపు ప్రక్రియ ముగియకుండా, రిజర్వాయర్ నింపేందుకు అవసరమైన హెడ్ రెగ్యులేటర్, ఫీడర్ కెనాల్ పనులు పూర్తి కాకుండా నీళ్లొస్తాయని నమ్మించడం కంటే మోసం మరొకటి ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

మరొకవైపు, ఈ ప్రాజెక్టు కోసం భూములు, సర్వస్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల నిర్వాసితుల పరిస్థితి మరీ దయనీయం. పురిటిగడ్డను వదిలిపెట్టి, పునరావాస ప్యాకేజీల కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారి కళ్లల్లో ఆశలు అడుగంటిపోయాయి. అటు సాగునీరు రాక, ఇటు సరైన పరిహారం అందక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు కుటుంబాలు నిత్యం భయాందోళనల మధ్యే కాలం వెళ్లదీస్తున్నాయి.

మంత్రుల తనిఖీలు, సమీక్షలు కేవలం వార్తలకే పరిమితం కాకుండా... కష్టతరమైన గుహల్లో నిలిచిపోయిన టిబిఎమ్ తొలగింపు పనులను వేగవంతం చేసి, నల్లమల సాగర్‌లోకి నీటిని తరలించి తమ నోళ్లలో మంచినీళ్లు పోయాలని ఈ ప్రాంత ప్రజలు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. పాలకులు ఇకనైనా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి తమను ఫ్లోరైడ్ రక్కసి నుంచి, కరువు రక్కసి నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు.

 

 

 

Veligonda Project, Veligonda Tunnel Inspection, Nimmala Rama Naidu, Nallamala Sagar Reservoir,
Prakasam District Drinking Water, AP Irrigation Projects, Veligonda Project Ground Report, Markapuram Fluoride Problem