కోహ్లీ పై సెహ్వాగ్ విమర్శలు...


భారత మాజీ డేరింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ కోహ్లీపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. మైదానంలో కోహ్లీ అనేక తప్పులు చేస్తున్నాడని... కానీ, ఎవరూ వేలెత్తి చూపించడం లేదని విమర్శించాడు. వాస్తవానికి కెప్టెన్ చేసే పొరపాట్ల గురించి నలుగురైదుగురు ఆటగాళ్లు మాట్లాడుతూ ఉంటారని... కానీ, భారత జట్టులో అలాంటి ఆటగాళ్లను తాను చూడలేదని చెప్పాడు. మైదానంలో కానీ, డ్రెస్సింగ్ రూమ్ లో కానీ కోహ్లీ చేస్తున్న పొరపాట్ల గురించి వేలెత్తి చూపే ఒక్క ఆటగాడు కూడా లేడని అన్నాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అనడంలో సందేహమే లేదని.. ఇతర ఆటగాళ్ల నుంచి కూడా అదే స్థాయి ఆట తీరును అతను ఆశిస్తున్నాడని... దీనివల్లే అతను అంచనాలను అందుకోలేక పోతున్నాడని... ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కెప్టెన్సీకే ప్రమాదకరమని చెప్పాడు. తనలాగే ఇతర ఆటగాళ్లు కూడా వేగంగా పరుగులు చేయాలని కోహ్లీ ఆశిస్తున్నాడని... ఇందులో తప్పేంలేదని అన్నాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడంతో కోహ్లీపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే కదా.