TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆజాద్, వాయలార్ మాటలు నమ్మని సోనియా

Published on: Fri Jun 15, 2012 9:13AM

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు ఉప ఎన్నికల ఫలితాలే కారణమవుతున్నాయి. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా ఉంటేనే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ పదవులు క్షేమంగా ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు చేదుగా మారితే వీరిద్దరికీ పదవీగండం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దేశరాజధానిలో కాంగ్రెస్ హైకమాండ్ వీరిద్దరి ప్రచారం తీరూ, పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. సిఎంగా కిరణ్ కుమార్ రెడ్డి పనితీరును విడిగానూ, బొత్సా పార్టీ పటిష్టానికి చేసిన పనిని విడిగానూ ఎఐసిసి సమీక్షించింది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జిగా వచ్చిన గులాంనబీ ఆజాద్, పరిశీలకునిగా వచ్చిన వాయలార్ రవి ఇప్పటికే మేడమ్ కు వీరిద్దరూ బాగా పనిచేశారని రిపోర్టు ఇచ్చారు. అయితే సోనియా మాత్రం ఆ మాటను నమ్మలేదనీ, రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాల్లో కనీసం రెండు అంకెలైనా వస్తేనే వీరిద్దరూ పనిచేసినట్టు నమ్ముతానని అన్నారని సమాచారం. జైలులో ఉన్నా జగన్ కోసం తెగించిన కార్యకర్తల తరహా జనం కాంగ్రెస్ లోనూ ఉంటే బాగుంటుందని సోనియా అభిప్రాయపడ్డారట. తమపై కేసులు పెడతారని తెలిసినా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ చూపిన చొరవ కాంగ్రెస్ లోనూ పెంచాలంటే ఏమి చేయాలో ఆలోచించమని సోనియా వీరిద్దరినీ కోరారట. ఫలితాలు సోనియా ఆశించినట్లు లేకపోతే కొత్త సిఎం, కొత్త పీసీసీ చీఫ్ తప్పేలా లేదని పరిశీలకులు అంటున్నారు.