TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నారాయణ అర్థనగ్న ప్రదర్శన..వ్యాట్‌పై సీఎంకు హెచ్చరిక

Published on: Mon Jan 30, 2012 8:10AM

హైదరాబాద్: వ్యాట్‌కు నిరసనగా రాష్ర్టంలో వస్త్ర వ్యాపారుల ఆందోళన కొనసాగుతోంది. ఇందిరా పార్క్ వద్ద వస్త్ర వ్యాపారులు నిర్వహించిన ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. వస్త్రాలపై వ్యాట్ ఎత్తివేయక పోతే మంత్రులు, ముఖ్యమంత్రి బట్టలు లేకుండా సోనియా గాంధీ వద్దకు వెళ్లాల్సి ఉంటుందని  నారాయణ హెచ్చరించారు.  "పరిస్థితి తీవ్రతను పట్టించుకోకపోతే వస్త్ర వ్యాపారులతోపాటు సామాన్య ప్రజానీకం మొత్తం కలిసి రాష్ట్ర ప్రభుత్వ బట్టలు ఊడదీయాలి'' అని పిలుపునిచ్చారు.వ్యాట్ ఉపసంహరణ డిమాండ్‌తో  హైదరాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన అర్ధనగ్నప్రదర్శనలో నారాయణ స్వయంగా చొక్కా విప్పి పాల్గొన్నారు. ఆ తర్వాత ధర్నా చౌక్ వద్ద చొక్కా లేకుండానే ప్రసంగించారు.ప్రభుత్వానికి దమ్ముంటే మద్యం సిండికేట్లలో ఉన్న నాయకులపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. "అధికారుల వేధింపులు, అవినీతిని పెంచి పోషించేందుకే వస్త్రాలపై వ్యాట్ విధిస్తున్నారు. ఇప్పటికే ప్రజలపై రకరకాల పన్నుల భారం మోపారు. నీటి చార్జీలూ పెంచారు. ఇప్పుడు మానాన్ని కాపాడుకునేందుకు వాడే వస్త్రాలపైనా పన్ను మోపుతున్నారు.  అని విమర్శించారు.

వ్యాట్ ద్వారా రూ.600 కోట్లు వస్తాయంటున్నారని, గాలి ఆస్తులను స్వాధీనం చేసుకుంటే వేల కోట్లు వస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ తాను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లుగా, గుడ్డిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమ దయానంద్, కన్వీనర్ అమ్మనబోలు ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి సంతోష్ చొక్కాని తదితరులతోపాటు పెద్దసంఖ్యలో వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. మరోవైపు వస్త్రవ్యాపారుల ఆందోళనకు మద్దతుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సీపీఎం నేతలు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.