TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రూటూ మారినా ఫేటు మారలా!

Published on: Tue Jun 7, 2022 12:09PM

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్... పార్టీ మారితే.. పేట్ మారుతుందని.. భావించారు. రూట్ మార్చారు. కానీ ఆయన రూట్ మార్చినా.. పేట్ మాత్రం మారలేదు. సరికదా. ఎమ్మెల్యే అయినా.. ఆయనకు రావాల్సిన గుర్తింపు రాకపోగా.. ఉన్న గుర్తింపును కూడా జగన్ పార్టీ నేతలు లేకుండా చేస్తున్నారట. దీంతో ఫ్యాన్ పార్టీలో  ఆయనకు గాలాడటంలేదట. ఇక చేసేది లేక. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలకు గణేష్ కుమార్ రాజీనామా చేసి.. రాజీనామా లేఖను ఉత్తరాంద్ర  ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డికి పంపారు. ఆ రాజీనామా లేఖలో వాసుపల్లి పలు అంశాలను ప్రస్తావించారు.  వాసుపల్లి  రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన వర్గం వివరించింది. 

వాసుపల్లి గణేష్ కుమార్.. కరడుగట్టిన టీడీపీ కార్యకర్త అని పేర్కొంటోంది. అంతేకాదు గతంలో ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ విశాఖపట్నం వచ్చి ప్రసంగించి వెళ్లారని.. ఆ తర్వాత సదరు ప్రదేశం కలుషితమైందంటూ... పసుపు నీళ్లు చల్లి.. వైయస్ జగన్‌పై తనకు ఉన్న ఆగ్రహాన్ని ఈ గణేశ్ అలా చల్లార్చుకున్నారని ఆయన వర్గం గుర్తు చేస్తోంది.  

అంతేకాదు.. నాడు వైయస్ జగన్‌పై విశాఖ జిల్లాలోని టీడీపీ నేతలు ఎవరు చేయనన్ని విమర్శలు ఈ వాసుపల్లి గణేష్ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆ రోజుల్లో విశాఖలో టీడీపీ ఫైర్ బ్రాండ్‌ నేత ఎవరంటే   వాసుపల్లి గణేశ్ పేరే చెప్పేవారని అంటుంది. విశాఖ నగరంలో టీడీపీ ఎక్కడైనా.. ఎలాంటి స్వచ్ఛంధ కార్యక్రమం చేపట్టినా.. ఈ వాసుపల్లి గణేశ్ కుమార్ ముందుండేవారని... ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌ను తట్టుకొని  విశాఖపట్నం నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగుర వేసిందని పేర్కొంది. వాసుపల్లి గణేష్ వర్గం చెబుతున్న మాటలన్నీ వాస్తవమే అయినా
 2020 మార్చిలో వాసుపల్లి గణేష్ కుమార్.. వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అందుకు కారణాలేమిటో ఆయన వర్గం చెప్పకపోయినా అందరికీ అర్ధమైపోయింది.  వైసీపీలో చేరడంనుంచీ వాసుపల్లికి అసలు సిసలు సమస్యలు   మొదలైనాయని ఆయన వర్గం చెబుతోంది.   నియోజకవర్గ  పార్టీ సమన్వయ బాధ్యతలు ఎమ్మెల్యే గణేశ్ కుమార్‌కు అప్పగించినా..వైసీపీ నేతలు మాత్రం ఆయన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేశారని ఆయన వర్గం ఇప్పుడు బాధపడుతోంది.

ఇదే విషయంపై నాటి ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ విజయసాయిరెడ్డికి ఎమ్మెల్యే గణేశ్ ఫిర్యాదు చేశారని.. కానీ ఆ ఫిర్యాదును ఆయన లైట్‌గా తీసుకుని.. ఇదే నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ని హైలెట్ చేశారని.. ఆ క్రమంలో   సుధాకర్.. విజయసాయిరెడ్డి అండ చూసుకొని .. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తనదేనంటూ తనదైన శైలిలో ప్రజల్లో ప్రచారం చేసుకొంటున్నారని ఎమ్మెల్యే గణేశ్ వర్గం చెబుతోంది. అంతేకాదు.. సీఎం జగన్, విజయసాయిరెడ్డి ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయంటూ సొంత డబ్బా కోట్టుకోవడంతో,  ఎమ్మెల్యే గణేష్ కుమార్.. రాజ్యసభ సభ్యులతో జగన్ సీఎం కాలేరు.. ఎమ్మెల్యేలు గెలిస్తేనే .. జగన్ సీఎం అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ తరుణంలోనే   ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించి... టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పార్టీ నాయకత్వం అప్పగించింది.
ఆ తర్వాత ఇదే అంశంపై వైవీ సుబ్బారెడ్డిని కలిసి గణేశ్ విన్నవించినా ఫలితం లేకుండా పోయిందట. ఈ నేపథ్యంలో అన్నిటికి ఒకటే మందు అని నియోజకవర్గ సమస్వయ కర్త పదవికీ రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారని వాసుపల్లి గణేష్ వర్గం చెబుతోంది. అయితే పార్టీ అభివృద్ధికి పాటుపడుతానంటూ ఆయన సదరు రాజీనామా లేఖలో పేర్కొనడం పట్ల  వాసుపల్లి వర్గీయులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దింపుడు కళ్లెం ఆశ వాసుపల్లి గణేష్ లో చావలేదంటున్నారు.