విజయసాయికి నోటీసులు ఇస్తారా?.. లేక మన ఎంపీ గారేలే అని ఊరుకుంటారా? 

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకు 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని నోటీసులు పంపిన పోలీసులు.. ఇప్పుడు వైసీపీ విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు పంపుతారా? అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య అటు పోలీసు శాఖని, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే లాజిక్ ని తెరమీదకు తీసుకువచ్చారు. 

 

చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే దళిత యువకుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఆయన డీజీపీకి కూడా లేఖ రాశారు. అయితే, ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని, వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. 

 

చంద్రబాబుకి పోలీసులు నోటిసులు ఇవ్వడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరితే.. సాక్ష్యాలివ్వండి, విచారిస్తామని.. పోలీసులు అనడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం ఘటన ఏపీలో ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ తీరు కారణంగానే ఏపీలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని విపక్ష నేతలు విరుచుకుపడుతుండగా.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం ఈ ఘటనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. 

 

"తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు." అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ విజయసాయి ట్వీట్ చేశారు.

 

విజయ సాయి వ్యాఖ్యలపై స్పందించిన వర్ల రామయ్య.. పోలీసులకి, ప్రభుత్వానికి చురకలు వేశారు. అంతర్వేది రధానికి నిప్పు పెట్టింది చంద్రబాబు అని ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి గారికి, 91 సీఆర్పీసీ క్రింద సాక్ష్యములు చూపించాలని పోలీసులు నోటీసులు ఇస్తారా? లేక మన ఎంపీ గారేలే అని వూరుకుంటారా? అని ప్రశ్నించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతి పక్షాలకు ఒక న్యాయమా? ఇదేనా మీ ప్రభుత్వ విధానం? అని వర్ల రామయ్య నిలదీశారు.

 

మరి అప్పుడు.. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. దర్యాప్తు చేయాలని చంద్రబాబు కోరితే.. 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని పోలీసులు నోటీసులు పంపారు. మరి ఇప్పుడు.. తునిలో రైలు ఘటన నుంచి అంతర్వేదిలో రథానికి నిప్పు వరకు చంద్రబాబే చేశారని విజయ సాయి అన్నారు. మరి వర్ల రామయ్య కోరినట్టు.. 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని విజయ సాయికి నోటీసులు పంపి పోలీసులు తమ విశ్వసనీయతని కాపాడుకుంటారో లేక అధికార పార్టీకి ఒక రూల్, ప్రతి పక్షాలకు ఒక రూల్ అని విమర్శలపాలవుతారో చూడాలి.