ఏపీలో ఉన్నది ఫేక్ సర్కారే! దిశ చట్టంపై మోసం చేశారన్న వర్ల
Published on: Thu Dec 3, 2020 3:46PM
దిశ చట్టాన్ని మరోసారి అసెంబ్లీ ప్రవేశపెట్టడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించారు. దిశ చట్టం రాకముందే తాము అమలు చేస్తున్నామని జగన్ సర్కార్ ప్రచారం చేసుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి దిశ బిల్లును తిప్పి పంపిన నిజం దాచి రాష్ట్ర ప్రజలను మోసగించిందని ఆరోపించారు. చట్టం అమలులోకి రాకముందే దిశ పోలీస్ స్టేషన్లు నిర్మించి జగన్ సర్కార్ భంగపడిందన్నారు వర్ల రామయ్య. చట్టం రాకముందే వచ్చినట్టుగా మోసగించిన ఈ ప్రభుత్వాన్ని ఫేక్ అనకూడదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. దిశ చట్టం విషయంలో వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి తప్పటడుగులు వేసిందని వర్ల రామయ్య విమర్శించారు.


