కోడెల చేసింది తప్పే.. ఆయన వల్ల పార్టీకి నష్టం: టీడీపీ నేత ఫైర్

 

ఒక పార్టీకి చెందిన నేత తప్పు చేస్తే.. ఆ పార్టీకి చెందిన మిగతా నేతలు ఆయన్ని వెనకేసుకొని రావడం చూస్తుంటాం. అయితే వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై మాత్రం సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ కోడెలపై విమర్శలు గుప్పించారు. కోడెల చర్యల కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారిందని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ను కోడెల తీసుకెళ్లడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఆయన తీరుతో టీడీపీకి నష్టం జరుగుతోందని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నాకు తెలిసినంతవరకూ కోడెల చేసింది తప్పే. విషయం బయటకు వచ్చాక ఇప్పుడు కావాలంటే ఫర్నీచర్ తీసుకెళ్లండి అని కోడెల చెప్పడం కరెక్ట్ కాదు' అన్నారు. అసెంబ్లీ సిబ్బంది తీసుకెళ్లలేదు కాబట్టి సామగ్రిని నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పడం కూడా తప్పే. కోడెల వ్యవహారశైలి కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని వర్ల రామయ్య పునరుద్ఘాటించారు. అదేవిధంగా రాజధాని మార్పు వార్తలపై కూడా వర్ల రామయ్య స్పందించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలపై జగన్ కు ద్వేషం ఉందనీ, అందుకే పిచ్చి తుగ్లక్ లా రాజధానిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య  ఆగ్రహం వ్యక్తం చేశారు.