వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ముంబయి తలోజా జైలు సిబ్బంది వరవరరావు భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం ఆయనకు తలోజా జైల్లో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. వరవరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే ఆరోగ్యం బాగా లేదంటూ బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న అభియోగాలతో వరవరరావు అరెస్ట్ అయ్యారు. కుట్రలో వరవరరావు పాత్ర కీలకమని, ఆయనకు బెయిల్ ఇవ్వరాదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు తెలిపింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను లోయర్ కోర్ట్ కొట్టేయడంతో..మహారాష్ట్ర హైకోర్టులో వరవరరావు బెయిల్ పిటీషన్‌‌ను వేశారు. తాజాగా, వరవరరావు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదన్న సమాచారంతో ఆయన కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.