TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోజాపై ఇద్దరు వాణీల పోటీ! న‌గ‌రిలో జ‌బ‌ర్ద‌స్త్ ఫైట్‌!

Published on: Tue Mar 22, 2022 4:43PM

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అసలే ఫైర్‌ బ్రాండ్‌.. ఆ పైన త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో హోంమంత్రి పదవి ఆమెనే వస్తుందంటూ పొలిటికల్‌ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. టెంపరితనం, తెగువ, మాట జాస్తి కూడా ఆమెలో ఒకింత ఎక్కువే. నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. నగరి సెగ్మెంట్‌ లో సిటింగ్‌ ఎమ్మెల్యే. అలాంటి రోజా ఇలాఖాలో ఇద్దరు వాణిలు వచ్చే ఎన్నికల్లో డైరెక్ట్‌ గా ఢీకొంటారనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీనటి దివ్యవాణి టీడీపీ అభ్యర్థిగా నగరి నుంచి బరిలో దిగేందుకు రంగం రెడీ అయిందంటున్నారు. తాజాగా మరో నటి వాణీ విశ్వనాథ్‌ ను తమ పార్టీ తరఫున నగరిలో పోటీచేయాలంటూ జనసేన నేతలు ఆహ్వానం పలకడం విశేషం. ఈ నేపథ్యంలో రోజాపై నువ్వా నేనా అంటూ కాలు దువ్వి, ఎన్నికల బరిలో దిగేందుకు దివ్యవాణి, వాణీ విశ్వనాథ్‌ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ తరఫున దివ్యవాణి ఇప్పటికే జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్‌ చేస్తున్న తప్పులపై ఎప్పటికప్పుడు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. 2019 జనవరిలో దివ్యవాణి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వెటరన్‌ హీరోయిన్‌ టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ అని దివ్యవాణికి మంచి పేరుంది. మొన్నటికి మొన్న జే ట్యాక్స్‌ కోసం జనం ప్రాణాలు తీసేస్తున్న జగన్‌ రెడ్డి అంటూ దివ్యవాణి నిప్పులు చెరగడం విశేషం. గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన దివ్యవాణి అసలు పేరు ఉషారాణి. ఆదినారాయణరావు- విజయలక్ష్మి దివ్యవాణి తల్లిదండ్రులు. హిందువుగా పుట్టినప్పటికీ తరువాతి కాలంలో దివ్యవాణి క్రిస్టియన్‌ మతం తీసుకున్నారు. మత ప్రబోధనలు కూడా చేస్తారు. సర్దార్‌ కృష్ణమనాయుడు సినిమాలో బాలనటిగా ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. ఈ చిత్ర దర్శకుడు ద్వారకేష్‌ ఈమె పేరును దివ్యవాణిగా మార్చారు. ‘ముత్యమంత ముద్దు’, ‘కొండవీటి దొంగ’, ‘పెళ్లి పుస్తకం’, ‘కవిసార్వభౌమ’, ‘రాధాగోపాళం’, ‘మహానటి’ తదితర సినిమాల్లో దివ్యవాణి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక వాణీ విశ్వనాథ్‌ 1971 మే 13న కేరళలోని త్రిశూర్‌ జిల్లా ఒల్లూరులో పుట్టారు. తజతువీట్టి విశ్వనాథం, గిరిజ ఆమె తల్లిదండ్రులు. మలయాళంలో 56, తెలుగులో 48, తమిళంలో 10, కన్నడంలో 5, హిందీలో 3 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని టీవీ షోలకు హోస్ట్‌ గా వ్యవహరించారు. వాణీ విశ్వనాథ్‌ పుట్టింది కేరళలో అయినా.. తెలుగు సినిమాల్లో తనకు మంచి గుర్తింపు రావడంతో 2017లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే.. ఇటీవలి కాలంలో వాణీ విశ్వనాథ్‌ ను టీడీపీ కాస్త పక్కన పెట్టేసిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాణీ విశ్వనాథ్‌ జనసేనలో చేరి, నగరి నుంచి రోజాపై పోటీ చేయాలంటూ ఆ పార్టీ నేతలు బ్యానర్లు పట్టుకుని మరీ ఆహ్వానించడం విశేషం. 2014 ఎన్నికలకు ముందు కూడా నగరి నుంచి పోటీ చేయాలని వాణీ విశ్వనాథ్‌ ఉవ్విళ్లూరారు. ఆఖరి నిమిషంలో ఆమె ప్రయత్నం విఫలమైంది. నగరి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు మంచి యూత్‌  ఫాలోయింగ్ ఉంది. వాణీ విశ్వనాథ్‌ జనసేన తరఫున బరిలో దిగితే నెగ్గిస్తామంటూ ఆ పార్టీ స్థానిక నేతలు బల్లగుద్ది మరీ చెబుతుండడం విశేషం.

ఇప్పటికే నగరిలో 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు రోజాను నియోజకవర్గం ప్రజలు ఎన్నుకున్నారు. ఎంతసేపూ జబర్దస్త్‌ లాంటి టీవీ షోలకే పరిమితం అవుతున్న రోజా నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎన్నికైన రోజాకు సహజంగానే వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. దాంతో పాటు చిత్తూరు జిల్లాకే చెందిన సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర నేతలతో రోజాకు పొసగడం లేదు. నగరి నియోజకవర్గంలో కొన్ని సామాజికవర్గం కార్పొరేషన్లు సహా పలు పదవులు రోజా సూచించిన వారికి కాకుండా పెద్దిరెడ్డి తదితరులు చెప్పిన వారికే దక్కుతుండడం గమనార్హం. నగరి నియోజకవర్గంలో రోజా మాటకు రోజురోజుకూ విలువ తగ్గిపోతోందని చెబుతున్నారు. దాంతో పాటు టీడీపీ- జనసేన పొత్తు ఏర్పడితే.. పొత్తులో భాగంగా జనసేనకు నగరి నియోజకవర్గాన్ని కేటాయిస్తే.. అటు జనసేన- ఇటు టీడీపీ ఒకే తాటిమీదకు వచ్చి ఎన్నికలకు వెళ్తే రోజా ఈసారి గెలవడం కష్టం అంటున్నారు. ఇప్పటి వరకు రోజా నగరి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న తమిళ ఓటర్ల మద్దతుపైనే ఆధారపడి ఉన్నారు. అయితే.. తమ సంక్షేమం, అభివృద్ధి కోసం రోజా ఇంతవరకు ఏమి చేశారని తమిళులు బేరీజు వేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద ఫైర్‌ బ్రాండ్‌ రోజా హవా నగరి నియోజకవర్గంలో తగ్గుతుండడం, నియోజకవర్గానికి అప్పుడప్పుడూ వచ్చి హడావుడి చేసి, తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోవడం తప్ప సెగ్మెంట్‌ అభివృద్ధికి చేసిన పనులు తక్కువే అంటున్నారు. అటు నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ఇటు చిత్తూరు జిల్లా స్థాయి నేతలు కూడా రోజాకు వ్యతిరేకం అవడమే కాకుండా ప్రజల్లో కూడా ఎమ్మెల్యే రోజా అంటే మోజు పలచబడిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి రోజా వైసీపీ టికెట్‌ తెచ్చుకున్నా గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రోజా కోటలో దివ్యవాణి పాగా వేస్తారా? లేక వాణీ విశ్వనాథ్‌ ఢంకా బజాయిస్తారా? వేచి చూడాల్సిందే.