TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వంగవీటికి వ‌ల!.. వైసీపీ గాలానికి రాధ చిక్కేనా?

Published on: Mon Dec 27, 2021 1:44PM

వంగ‌వీటి రాధాకృష్ణ‌. విజ‌య‌వాడ‌లో బ‌ల‌మైన నేత‌. వైసీపీ ఆయ‌న్ను వాడుకొని వ‌దిలేసింది. ఘోర అవ‌మాన‌భారంతో పార్టీని వీడారు వంగ‌వీటి. టీడీపీ అక్కున చేర్చుకుంది. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా స్థ‌బ్దుగా ఉన్నారు రాధాకృష్ణ‌. అటు, ఆయ‌న ప్ర‌త్య‌ర్థి దేవినేని వ‌ర్గం.. ఏ పార్టీ ప‌వ‌ర్‌లో ఉంటే ఆ పార్టీ పంచ‌న చేరుతోంది. దేవినేని గ‌తంలో టీడీపీ.. ఇప్పుడు వైసీపీ.

వంగ‌వీటి రంగా వ‌ర్థంతి సంద‌ర్భంగా బెజ‌వాడ‌లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు తెర‌లేచింది. రాధాకృష్ణ‌ను మ‌రోసారి దువ్వ‌డం స్టార్ట్ చేసింది వైసీపీ. ఆయ‌న మిత్రులైన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు జ‌గ‌న్ ప‌క్షాన‌ రంగంలోకి దిగారు. మ‌నం మ‌నం మిత్రుల‌మంటూ.. రంగా ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తామంటూ పొలిటిక‌ల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఇంత‌కీ విజ‌య‌వాడ‌లో ఏం జ‌రుగుతోంది?  వైసీపీ వ్యూహ‌మేంటి? వంగ‌వీటికి వ‌ల విసరాల్సినంత అవ‌స‌రం ఏమొచ్చింది? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. 

వంగ‌వీటి వ‌ర్సెస్ దేవినేని. కాపు వ‌ర్సెస్ క‌మ్మ‌. అంతా ఓపెన్ సీక్రెట్‌. అలాంటిది.. ఇప్ప‌టికే దేవినేనిని వైసీపీలో క‌లిపేసుకోగా.. తాజాగా వంగ‌వీటికి పార్టీ కండువా క‌ప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? రెండు క‌త్తుల‌ను ఒకే ఒర‌లో ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అది సాధ్య‌మా? అంటున్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో మంచి రెస్పెక్ట్‌తో ఉన్న వంగ‌వీటి రాధాకృష్ణ‌.. గ‌తంలో టికెట్ ఇవ్వ‌కుండా జ‌గ‌న్ చేసిన అవ‌మానాన్ని మ‌ర్చిపోయి.. మ‌ళ్లీ వైసీపీలో చేరుతారా? అంటే అనుమాన‌మే అంటున్నారు. 

రాధాకృష్ణ వైసీపీలోకి వెళ్లే ఛాన్సెస్ లేవు కాబ‌ట్టే.. ఆయ‌న్ను ఎలాగైనా పార్టీలోకి ర‌ప్పించాల‌నే.. నాని, వంశీల‌తో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేశారంటున్నారు. వంగ‌వీటికి ఎమ్మెల్సీ ఆఫ‌ర్ కూడా ఇచ్చార‌ని అంటున్నారు. మ‌రి, వంగ‌వీటిని పార్టీలోకి ఆహ్వానిస్తే.. దేవినేని వైసీపీలో ఉంటారా? ఉండ‌నిస్తారా? ఈయ‌నను తీసుకొని.. ఆయ‌న‌ను సాగ‌నంపుతారా? ఇలా ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇవేవీ కావ‌ని.. వంగ‌వీటి వైసీపీకి ద‌గ్గ‌ర‌వుతున్నార‌ని.. త్వ‌ర‌లోనే అధికార‌పార్టీలో చేరుతారంటూ ప్ర‌చారం జ‌రిగేలా చేసి.. రాధాకృష్ణ‌ను టీడీపీ అనుమానించేలా చేయ‌డ‌మే నాని, వంశీల‌ అస‌లు ఉద్దేశం అంటున్నారు. 

మ‌రోవైపు.. వంగవీటి రాధాకృష్ణ తన తండ్రి వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు రెక్కీ చేశారని.. దేనికైనా రెడీ అంటూ స‌వాల్ చేశారు. ఇంతకీ వంగవీటిని చంపేందుకు ఎవరు రెక్కీ నిర్వహిస్తారు? అంత అవ‌స‌రం ఎవ‌రికి ఉంది? అది ఆ వ‌ర్గ‌మేనా? ప్ర‌శాంతంగా ఉన్న బెజ‌వాడ‌.. వైసీపీ హ‌యాంలో మ‌ళ్లీ హ‌త్యా రాజ‌కీయాల‌కు వేదిక‌గా మార‌నుందా? అనే భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. వంగ‌వీటి ఎపిసోడ్ మ‌రోసారి బెజ‌వాడ రాజ‌కీయాల‌ను రంజుగా మార్చేసింది.